వాట్సాప్ వేదికగా... అభాగ్యులకు అండగా
● తెలిసిన అన్ని గ్రూపుల్లో సమాచారం పోస్టు ● సభ్యులతోపాటు దాతల నుంచి విరాళాల సేకరణ
● ఇబ్బందుల్లో ఉన్నవారికి అందజేత ● సేవాభావం చాటుతున్న ఉమ్మడి జిల్లాలోని పలు సంస్థలు
హెల్పింగ్ హ్యాండ్స్
కమాన్‌పూర్(మంథని): కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నారగోని సతీశ్ తన స్నేహితులతో కలిసి 2018లో హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రస్తుతం సుమారు 1,000 మంది సభ్యులున్నారు. అందరూ కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యావసర సరుకులు అందించారు. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పొగుట్టుకున్న పందిల్ల సుమన్‌కు రూ.1.60 లక్షలతోపాటు సామగ్రి అందజేశారు. మండల కేంద్రానికి చెందిన తోటపల్లి భూమయ్యకు రూ.1.06 లక్షలు, గుండారం గ్రామానికి చెందిన రాసకొండ ప్రేమ్‌సాగర్ కేన్సర్‌తో చనిపోగా అతని కుటుంబానికి రూ.1.13 లక్షలు ఇచ్చారు. అంతేకాకుండా నిరుపేద అడబిడ్డల వివాహాలకు, అనాథ అశ్రమాలకు ఆర్థికసాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
జీనియస్ చెస్ అకాడమీ
సప్తగిరికాలనీ(కరీంనగర్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన సిలివేరి మహేందర్ నరాలకు సంబంధించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తే రూ.30 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో ఆయనకు కరీంనగర్‌లోని జీనియస్ చెస్ అకాడమీ అండగా నిలిచింది. మహేందర్ సమస్యకు సంబంధించిన పోస్టు తన వాట్సాప్ గ్రూపులో రావడంతో అకాడమీ డైరెక్టర్ కంకటి కనకయ్య, కోచ్ కంకటి అనూప్‌కుమార్ వెంటనే స్పందించారు. సాయం చేయాలని కోరడంతో వాట్సాప్ గ్రూప్‌లోని చిన్నారుల తల్లిదండ్రులు రూ.లక్ష అందించారు. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో ఒలింపిక్ సంఘం ఉమ్మడి జిల్లా బాధ్యులు జనార్దన్ రెడ్డి, రమేశ్ రెడ్డిలకు అందించి, నేరుగా ఆస్పత్రి అకౌంట్‌లో జమ చేయించారు.
ఇల్లంతకుంట బడి దోస్తులు, ఎఫ్‌బీఐ
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట ఉన్నత పాఠశాలలో 2005 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు 58 మంది బడి దోస్తులు పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతినెలా సభ్యులు రూ.100 చొప్పున జమ చేస్తున్నారు. ఇల్లంతకుంటకు చెందిన కాసుపాక తిరుపతి మృతిచెందగా బాధిత కుటుంబానికి రూ.11 వేలు, వల్లంపట్లలో ఎర్రవెల్లి శంకర్ చనిపోగా బాధిత కుటుంబానికి రూ.15 వేలు, ఇల్లంతకుంటలో రొడ్డ శ్రీకాంత్ అనారోగ్యానికి గురవగా రూ.11 వేలు, బండారి రమేశ్ మరణించగా అతని కుటుంబానికి రూ.13 వేలు ఆర్థికసాయం చేశారు. అలాగే, ఇదే పాఠశాలకు చెందిన 1996 పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు ఫోరం ఫర్ బెటర్ ఇల్లంతకుంట(ఎఫ్‌బీఐ) వాట్రాప్ గ్రూపుగా ఏర్పడ్డారు. అనంతారం గ్రామానికి చెందిన ఓల్లాల అంజయ్య చనిపోగా బాధిత కుటుంబానికి రూ.73 వేలు అందించారు. అనాథ పిల్లలకు సాయం చేస్తున్నారు. ఇల్లంతకుంట, దాచారం, వల్లంపట్ల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. గల్ఫ్‌లో చనిపోయినవారి కుటుంబసభ్యులకు ఉచితంగా కుట్టు మెషిన్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment