అంకితభావంతో పని చేయాలి
ధర్మారం: ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంలో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. ధర్మారం మండలం నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పత్తిపాక వరిధాన్యం కోనుగోలు కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఆసుపత్రి లో వసతులు, సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు. పత్తిపాక క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిబంధన ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మి ల్లులకు తరలించాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ అరీఫ్, ఆర్‌ఐ వరలక్ష్మీలున్నారు.
సర్వే వివరాల ఆన్‌లైన్‌పై శిక్షణ
కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలో నిర్వహిస్తున్న కుటుంబ సర్వేలో సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు మంథని జేఎన్‌టీయూ విద్యార్థులకు బుధవారం బల్దియా అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 175 మంది విద్యార్థులకు హైదరాబాద్‌లో శిక్షణ పొందిన నగరపాలక సంస్థ సిస్టం మేనేజర్ సుధాకర్ డెమో ద్వారా వివరించారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలను సంబంధిత వెబ్‌సైట్ తెరుచుకున్న వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు వెల్లడించారు.
విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలి
జూలపల్లి: బాలికలకు విద్యతో పాటు నాణ్య మైన భోజనం అందించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు అన్నా రు. జూలపల్లి మండలం తేలుకుంట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సరుకులు, కూరగాయలు, బియ్యం, వంటగది, తాగునీటి కుళాయిలను పరిశీలించారు. వంటగది అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సరిపడా బెడ్స్ లేవని, ప్రహరీ ఎత్తు పెంచేందుకు సహకరించాలని ప్రిన్సిపాల్ శ్రీలత కోరారు. అనంతరం తేలు కుంట, చీమలపేటలోని అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, గర్భి ణులకు పౌష్టికాహారం, చిన్నారులకు ఆటపాటల విద్యను పరిశీలించి గర్భిణులకు సీమంతం చేశారు. ఆమె వెంట పెద్దపల్లి ఐసీడీఎస్ సీడీపీవో కవిత, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ లక్ష్మీ తదితరులున్నారు.
నాణ్యతలో రాజీలేకుండా ముందుకు సాగాలి
గోదావరిఖని: నాణ్యతతోనే సంస్థ భవిష్యత్ ముడిపడి ఉందని, ఉద్యోగులు రాజీలేకుండా ముందుకు సాగాలని సింగరేణి డైరెక్టర్ డి.సత్యనారాయణరావు అన్నారు. బుధవారం బొగ్గు నాణ్యతా వారోత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బొగ్గు కొనుగోలు దారులు, ఏరియా జీఎంలు, అన్నిగనుల మేనేజర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. బొగ్గు నాణ్యత లోపిస్తే సంస్థ మనుగడే కష్టంగా మారుతుందన్నారు. ఏటా బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహిస్తూ కార్మికులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సింగరేణి బొగ్గు కొనుగోలుకు మార్కెట్లో కస్టమర్లు పోటీ పడుతున్నారని అన్నారు. అనంతరం నాణ్యత ప్రతిజ్ఞ చేయించారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, రీజియన్ క్వాలిటీ జీఎం భైధ్యా, కార్పొరేట్ క్వాలిటీ జీఎం రవికుమార్, ఆర్జీ–2,3, శ్రీరాంపూర్ జీఎంలు వెంకటయ్య, సుధాకర్‌రావు, శ్రీనివాస్, క్వాలిటీ డీజీఎం సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment