పారిశ్రామికం.. పర్యాటకం.. ఆధ్యాత్మికం
● ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్
● అంతర్గాంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు
● ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో రాష్ట్రావసరాలకు సరిపడా యూరియా ఉత్పత్తి
● కాంట్రాక్టు కార్మికులకు కార్పొరేట్ వైద్యం కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి
రామగుండం: పారిశ్రామికంగానే కాకుండా పర్యాటకం, ఆధ్యాత్మికంగానూ జిల్లా ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది. ప్రధానంగా బొగ్గు గనులకు కేరాఫ్‌గా నిలిచిన గోదావరిఖనిలో విద్యుత్, యూరియా ఉత్పత్తి పరిశ్రమలతో అభివృద్ధి పుంజుకుంటోంది. విమానాశ్రయం, రైల్వేస్టేషన్ విస్తరణ, ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు మార్గం సుగమం, తోలు పరిశ్రమ, రామునిగుండాల ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
విద్యుత్ కేంద్రాల నిర్మాణం..
రామగుండంలోని ఎన్టీపీసీలో త్వరలోనే స్థాపించే 2,400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఇటీవల సాగింది. సలహాలు, సూచనలు, సమస్యల పరిష్కారం, ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలను లేవనెత్తిన ప్రజలు, పలువురు ప్రతినిధులు ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకత చూపకపోవడంతో మార్గం సుగమమైంది. రామగుండంలో మూతపడిన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణానికి కూడా మార్గం సుగమమైంది. మేడిపల్లి ఓపెన్‌కాస్టుపై 500 మెగావాట్ల సామర్ధ్యంతో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ దశకు చేరుకుంది. అవసరమైన నిధులు కూడా సింగరేణి కేటాయించినట్లు తెలిసింది.
తోలు పరిశ్రమకు స్థలం కేటాయింపు..
లింగాపూర్‌లో చర్మకార ఉత్పత్తుల కోసం పదేళ్ల క్రితమే ప్రభుత్వం స్థలం కేటాయించింది. లిడ్ క్యాప్(తోలు/చర్మ పరిశ్రమ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతర్గాంలోని ఖాయిలాపడిన స్పిన్నింగ్, వీవింగ్ మిల్లుల భూముల్లో డొమెస్టిక్ విమానాశ్రయం స్థాపనకు అనువుగా ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. భూ వివరాలను టెక్స్‌టైల్‌శాఖ ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది.
ఈఎస్‌ఐ ఆస్పత్రి..
పట్టణంలోని ఖాళీ స్థలంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి కోసం బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే భూమిపూజ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ రానున్నట్లు సమాచారం. బైపాస్ వద్ద 150 అడుగుల ఎత్తుతో హనుమాన్ భారీ విగ్రహం నిర్మించడం ద్వారా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అమృత్‌భారత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.కోట్లు వెచ్చించారు. ప్రస్తుతం పనులు చివరిదశకు చేరుకున్నాయి. మరోవైపు.. రామగుండం–మణుగూరు మధ్య కొత్త రైల్వేలైన్ పనులతో కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. రైల్వేలైన్‌కు అవసరమైన భూ సంబంధిత అంశాలపై కేంద్రప్రభుత్వం అదనపు కలెక్టర్లకు ఇటీవల బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే.
గోదావరిఖని కేంద్రంగా..
గోదావరిఖనిలోని వైద్యకళాశాలలో ఇటీవలనే నర్సింగ్ కళాశాల ప్రారంభమైంది. వీటికి అనుబంధంగా పీజీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దంత వైద్యకళాశాల, పాలిటెక్నిక్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి.
అంతర్గాం, పాలకుర్తి పరిధిలో..
అంతర్గాం, పాలకుర్తి మండలాల పరిధిలో బండ ల వాగు ప్రాజెక్టు, బ్రాహ్మణపల్లి ఎత్తిపోతలతో మెట్టప్రాంత భూములకు సాగునీరు అందుతుందని అధి కారులు చెబుతున్నారు. సుమారు 30వేల ఎకరాల్లో ని ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు సాగునీరు సమృద్ధిగా ఉంటుందని పేర్కొంటున్నా రు. త్వరలోనే బ్రాహ్మణపల్లి ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసి, పర్యాటకులను ఆక ర్షించేలా, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా తీర్చిదిద్దేందుకు కోటిలింగాల–ఎల్లంపల్లి మధ్య బోటింగ్ సౌకర్యం కల్పించేలా సమాలోచనలు కూడా చేస్తున్నారు.
ప్రభుత్వం, పరిశ్రమల నుంచి నిధుల కోసం కృషి
నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇవి అందుబాటులోకి వస్తే నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి.
– మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం
Comments
Please login to add a commentAdd a comment