టార్గెట్ 100 శాతం
సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయడం లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పట్టణాల్లోకన్నా గ్రామాల్లో వసూలు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 70 శాతానికిపైగా ఆస్తిపన్ను వసూలైనట్లు అధికారులు వివరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కారోబా ర్లు గ్రామాల్లో ఇంటింటా పర్యటిస్తూ పన్ను చెల్లించాలని యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటా సర్వే చేస్తూ సంక్షేమ పథకాలకు అర్హుల ను గుర్తించడంతోపాటు పనిలో పనిగా ఆస్తిపన్ను చెల్లించాలని సూచిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలాఖరు వరకు 100 శాతం వసూ లు చేయాలని నిర్దేశించుకున్నారు. శనివారం వరకు 70 శాతానికి పైగా ఆస్తిపన్ను వసూలు చేశారు.
పల్లెల్లో ప్రత్యేక పాలన
గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ఇటీవల పూర్తయింది. ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. అయితే, నిధులు లేక పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. దీంతో నిధులు సమకూర్చుకునేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే వందశాతం ఆస్తిపన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించారు.
బకాయిలు లేకుండా..
త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారనే ఉద్దేశంతో వార్డు సభ్యులు, సర్పంచులుగా పోటీచేసే అవకాశం ఉన్నచాలామంది గ్రామపంచాయతీలకు బకాయిలు లేకుండా అన్ని రకాల చెల్లింపులు చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు.. వసూళ్లను వేగవంతం చేశారు. ఆస్తిపన్నుతోపాటు వారసంత, కమర్షియల్ లైసెన్సులు, ఇళ్ల నిర్మాణ అనుమతి పన్నులను ప్రణాళిక ప్రకారం వసూలు చేస్తున్నారు.
నమోదు చేసింది 70 శాతం
జిల్లాలో శరవేగంగా ఆస్తిపన్ను వసూలు
లక్ష్య సాధనకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు
జిల్లాలో ఆస్తిపన్ను వసూలు ఇలా
మండలం వసూలైంది(రూ.లలో)
అంతర్గాం 17,08,436
ధర్మారం 25,11,712
ఎలిగేడు 7,53,236
జూలపల్లి 7,00,766
కమాన్‌పూర్ 14,64,690
మంథని 13,28,008
ముత్తారం 9,34,414
ఓదెల 21,91,575
పాలకుర్తి 17,51,998
పెద్దపల్లి 34,69,456
రామగిరి 20,14,032
కాల్వశ్రీరాంపూర్ 16,22,450
సుల్తానాబాద్ 22,05,889
ఒకవైపు సర్వే.. మరోవైపు ఆస్తిపన్ను వసూలు
జిల్లాలోని 13 మండలాల పరిధిలో 266 గ్రామ పంచాయతీల కార్యదర్శులు, కారోబార్లు ఆస్తిపన్ను వసూలులో నిమగ్నమయ్యారు. ఈనెలాఖరులోగా 100శాతం వసూలు చేస్తాం. సంక్షేమ పథకాల కోసం అర్హులను ఎంపిక చేసేందుకు సర్వే చేపట్టాం. ఈ పనులు చేస్తూనే ఆస్తిపన్ను వసూలు చేస్తున్నాం. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఒకేసారి రెండురకాల విధులు నిర్వర్తించడం సంతోషంగా ఉంది.
– వీరబుచ్చయ్య, డీపీవో
Comments
Please login to add a commentAdd a comment