సాక్షి, హైదరాబాద్: కమలంలో అసంతృప్త రేకలు విచ్చుకోకుండా అధినాయకత్వం అప్రమత్తమైంది. క్రమశిక్షణ, పార్టీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించేవారిని ఉపేక్షించబోమనే సంకేతాలు ఇవ్వడానికి సమాయత్తమవుతోంది. అసమ్మతి నేతలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. మంగళవారం కొందరు అసంతృప్త నేతలు హైదరాబాద్‌లో జరిపిన భేటీని సీరియస్‌గా తీసుకుంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఆ నాయకులకు షోకాజ్ నోటీసులివ్వనున్నట్లు సమాచారం. ఈ నోటీసులపై సదరు నాయకులిచ్చే వివరణలు సంతృప్తికరంగా లేనిపక్షంలో వేటు వేసేందుకు కూడా వెనక్కి తగ్గేది లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కొందరు నాయకులు పదేపదే అసంతృప్త సమావేశాలు నిర్వహించడం, మీడియాలో ఆ వార్తలు రావడం వంటి అంశాలు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లాయి. అధినాయకత్వం ఆదేశాల మేరకు వారిపై రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ క్రమశిక్షణాచర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. సంజయ్ సొంత జిల్లా అయిన కరీంనగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత సుగుణాకరరావు అసంతృప్త సమావేశాలు నిర్వహిస్తున్నారని, వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన కోర్ కమిటీలు తీర్మానం చేసి కొద్దిరోజుల క్రితం జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు పంపినట్టు సమాచారం. ఇంకా ఉపేక్షిస్తే పార్టీ నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నాయి.
ఈ తీర్మానాలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ పరిగణనలోకి తీసుకుని క్రమశిక్షణచర్యలు తీసుకోవాలని సంజయ్‌కు సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఇద్దరిలో మార్పు వస్తుందని సంజయ్ ఇంతకాలం వేచి చూసి, ఈ వ్యవహారాన్ని సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పగించారు. వారితో భేటీ అయిన ఇంద్రసేనారెడ్డి పార్టీకి నష్టం చేకూర్చే చర్యలకు పాల్పడితే ఇబ్బందులు తప్పవని సూచించినట్టు చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, చింతా సాంబమూర్తి, రాములు, వెంకటరమణిలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
మాపై దుష్ప్రచారం: ఆ నేతల వివరణ
అసమ్మతి సమావేశాల్లో పాల్గొనలేదని, అసలు అలాంటి సమావేశాలను తాము నిర్వహించలేదని బీజేపీ అసంతృప్త నాయకులు పేర్కొన్నారు. ‘కొన్ని వార్తాచానళ్లు అసమ్మతి నాయకుల సమావేశం అని ప్రచారం చేశాయి. అది దురుద్దేశపూర్వకంగా, కుట్రతో చేస్తున్న అవాస్తవ ప్రచారం’అని గుజ్జుల రామకృష్ణారెడ్డి, చింతా సాంబమూర్తి, పాపారావు ఖండించారు. ‘అందరం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే క్రియాశీల కార్యకర్తలమే’నని వెంకటరమణి స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ దారిలోనే నడుచుకుంటాను. నేను భేటీకి వెళ్లినట్టుగా పత్రికల్లో, చానెళ్లలో వచ్చిన కథనాలు ఖండిస్తున్నాను’అని నాగూరావు నామాజీ తెలిపారు. ‘నాకు రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో ఎలాంటి అసమ్మతి లేదు. నేను ఎటువంటి అసమ్మతి సమావేశానికి హాజరు కాలేదు’అని నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
అసంతృప్త నేతలపై ఇక కొరడా! బీజేపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్!
Published Thu, Feb 24 2022 2:32 AM | Last Updated on Thu, Feb 24 2022 2:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment