మన పాలన లేక దేశ రైతాంగానికి నష్టం: కేసీఆర్‌ | BRS Leader KCR Comments On Congress Party | Sakshi
Sakshi News home page

మన పాలన లేక దేశ రైతాంగానికి నష్టం: కేసీఆర్‌

Published Fri, Jul 5 2024 5:22 AM | Last Updated on Fri, Jul 5 2024 5:24 AM

BRS Leader KCR Comments On Congress Party

రాష్ట్ర ఫలితాలపై మహారాష్ట్రలోనూ ఆవేదన : కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ పాలన లేకపోవడంతో మహారాష్ట్రతోపాటు దేశం కూడా నష్టపోయిందనే భావన కొందరు మహారాష్ట్ర నేతలు తనవద్ద వ్యక్తం చేశారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమితో కేసీఆర్‌ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారన్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం తనను కలిసేందుకు వచి్చన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు. 

‘విద్యుత్, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణతో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్‌ పాలన కావాలని కోరుకున్నారు. ఆబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో రైతురాజ్యం తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్‌తో కలిసి అడుగులు వేశారు. దేశ రైతాంగం పురోగతికి బయలుదేరిన బీఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతులను నిరుత్సాహ పరిచింది’అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 

ప్రజలదే అంతిమ నిర్ణయం 
‘ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం. అధికారం, ప్రతిపక్ష పాత్ర మనకు శాశ్వతం కాదు..ప్రజాతీర్పే శిరోధార్యం. వారు ఏ పాత్ర అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదు. ప్రజాసంక్షేమానికి కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం. దానికి గెలుపోటములతో సంబంధం ఉండదు. 

ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యల మీద నిరంతర పోరాటం ద్వారా అభిమానాన్ని సాధించాలి. గత ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించక పోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతోంది. రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధే బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యం.నిరంతరం ప్రజాక్షేత్రంలో పనిచేయాలంటూ’పార్టీ కేడర్‌కు కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. 

సమాచారం లేకుండా రావొద్దు 
ముందస్తు సమాచారం లేకుండా తనను కలిసేందుకు వచ్చి ఇబ్బంది పడొద్దని పార్టీ నేతలకు కేసీఆర్‌ సూచించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నుంచి అందే సమాచారం తర్వాతే స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకొని రావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కేసీఆర్‌ తిరిగి సీఎం కావాలని నినాదాలు చేశారు. గురువారం కేసీఆర్‌ను కలిసిన వారిలో ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ నర్సాపూర్‌ ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement