లిక్కర్ కేసులో తెలంగాణ బీజేపీ.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తుందా?. కాంగ్రెస్ మౌనాన్ని కమలనాథులు ప్రశ్నించడం వెనక కారణమేంటీ ? మహిళా గోసా– బీజేపీ భరోసా కార్యక్రమంతో పొలిటికల్‌గా బీజేపీకి మైలేజ్ వస్తుందా ? లిక్కర్ కేసుపై బీజేపీ వ్యూహమేంటీ ?
సోనియాకు లింకేంటీ?
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేతృత్వంలో మహిళా గోసా.. బీజేపీ భరోసా పేరుతో నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో చేపట్టిన దీక్షకు కౌంటర్‌గా ఏర్పాటు చేసిన దీక్షలో అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్‌ను నేతలు టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనని.. ఎమ్మెల్సీ కవిత.. సోనియా గాంధీని పొగిడిన విషయాన్ని డీకే అరుణ గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ పై కాంగ్రెస్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని డీకే అరుణ అన్నారు.
ఓటుకు నోటు మరిచిపోయారా?
రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు ఏమైందని ప్రశ్నించారు బీజేపీ జాతీయ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. డ్రగ్స్ కేసు విచారణ ఎందాక వచ్చిందని.. ముడుపులు ముట్టడంతో ముడిచి పెట్టారా అని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. మహిళలపై దాడులు చేసిన వారికి బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే అండగా నిలుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు లిక్కర్ కేసుపై ఎందుకు స్పందించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసుతో పీసీసీ చీఫ్ కు ఎమైనా సంబంధాలు ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎలక్షన్స్ ముందు ఇదే కమలం అస్త్రం
లిక్కర్ కేసుతో పొలిటికల్ మైలేజ్ పొందాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి.నడ్డా మహిళా గోసా–బీజేపీ భరోసా కార్యక్రమం చేపట్టిన డీకే అరుణ, బండి సంజయ్ కు ఫోన్ చేసి అభినందించారు. బెల్ట్ షాపులను నియంత్రించాలని.. మహిళాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఇలాంటి ఆందోళన కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు నిర్వహించాలని జేపి.నడ్డా పార్టీ నేతలను ఆదేశించారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ తెలంగాణలో పాగా వేయాలన్న బీజేపీ స్కేచ్ ఏమేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
-విక్రమ్, సాక్షిన్యూస్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment