అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ రెబెల్స్ బెడదతో సతమతమవుతున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ పలువురు సీనియర్లు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగిన ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ద్విముఖ పోరు నెలకొని ఉంది. అయితే రెండు పార్టీలకూ మరో రకమైన పోటీ కూడా ఎదురవుతోంది. అది సొంత పార్టీల్లోని అసమ్మతుల రూపంలో! టికెట్లు దక్కలేదన్న అసంతృప్తితో వారు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. రెబెల్స్ అవతారమెత్తి తమ పార్టీ నాయకత్వాలకు సవాలు విసురుతున్నారు. అభ్యర్థుల జాబితాలు వెలువడుతున్న కొద్దీ రెండు పార్టీలకూ ఈ తలనొప్పి మరింత పెరుగుతోంది...
రాజస్తాన్: 12 చోట్ల తిరుగుబాట్లు
బీజేపీ తొలి జాబితాలో ప్రకటించిన 41 మంది అభ్యర్థుల్లో ఏకంగా డజను చోట్ల రెబెల్స్ గుబులు రేపుతున్నారు. ముఖ్యంగా విజయావకాశాలను పెంచుకునేందుకు సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం బెడిసికొడుతున్నట్టు కన్పిస్తోంది. వారిలో చాలామందికి రెబెల్స్ బెడద అధికంగా ఉంది. ఈ అభ్యర్థులకు వ్యతిరేకంగా స్థానిక ఆశావహులు, వారి మద్దతుదారులు నిరసనలు, ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు.
మాజీ కేంద్ర మంత్రి రాజ వర్ధన్‌సింగ్ రాథోడ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఆదివారం ప్రచార బరిలో దిగిన ఆయనకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రెబెల్స్ వర్గీయులు ఎక్కడికక్కడ రాథోడ్‌ను అడ్డుకుంటూ నిరసనలతో హోరెత్తించారు. నల్ల జెండాలతో ప్రదర్శనలకు దిగారు. అభ్యర్థుల మలి జాబితాలు వెలువడ్డాక పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని బీజేపీ ఆందోళన పడుతోంది.
ఛత్తీస్‌గఢ్: కాంగ్రెస్‌కు తలనొప్పి
రాష్ట్రంలో కాంగ్రెస్ తొలి జాబితాలో ప్రకటించిన 30 మంది పేర్లలో ఏకంగా 8 మంది సిట్టింగులకు టికెట్లు నిరాకరించింది. వారిపై కార్యకర్తల్లో అసంతృప్తి తదితరాలు కారణంగా చూపింది. కానీ వారంతా పార్టీ నిర్ణయంపై భగ్గుమంటున్నారు. స్వతంత్రులుగా బరిలో దిగి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
మొత్తం 90 స్థానాలకు గాను ఇప్పటికే ఏకంగా 85 మంది పేర్లను ప్రకటించిన బీజేపీ మాత్రం తన 13 మంది సిట్టింగుల్లో ఒక్కరికి మాత్రమే టికెట్ నిరాకరించింది. అది కూడా అంతర్గత సర్వేల్లో ఆయన పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనందుకేనని పేర్కొంది. కానీ ఆ 85 స్థానాల్లో పలుచోట్ల అసమ్మతి స్వరాలు విన్పిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పెరిగి పెరిగి తిరుగుబాట్లకూ దారితీసే ఆస్కారముందని పార్టీ ఆందోళన చెందుతోంది.
ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేయడమే గాక శరవేగంగా పార్టీలు కూడా మారిపోయారు. బీజేపీ నుంచి మమతా మీనా ఆప్‌లోకి, ర„Š పాల్‌సింగ్, రాసల్‌సింగ్ బీఎస్పీలోకి దూకారు. కాంగ్రెస్ నుంచి ఛటాభుజ్ తోమర్ ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంటుందని రాజకీయ పరిశీలకులు జోస్యం చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment