KSR Comments On Chandrababu Naidu Recent Speech - Sakshi
Sakshi News home page

మరి మీరు మాట్లాడేది ప్రజాస్వామ్యమా చంద్రబాబు?

Published Mon, May 8 2023 7:05 PM | Last Updated on Mon, May 15 2023 2:43 PM

KSR Comment On Chandrababu Naidu Recent Speeches - Sakshi

‘‘మీడియాకు ఎధికల్ వాల్యూస్ విలువలు ఉన్నాయా? సంస్కారం లేదు. విలువ లేదు. బానిస బతుకులు బతుకుతున్నారు.. సమయం వస్తుంది. మీకు కూడా చూపిస్తాను.. మీ ప్లేస్ ఎక్కడ ఉందో చూపిస్తాను. అప్పుడు మీ సంగతి చూస్తా. ప్రజల సైడ్ ఉండకపోతే బాన్ చేస్తాం. సాక్షిని బాన్ చేశాం. ఎన్టీటీవీని, టీవీ9ని బాన్ చేశాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజల వైపు ఉండకపోతే అంతే’’ అంటూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. అంటే ఈ రకంగా మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నమాట. పైగా తాను అధికారంలోకి వస్తే తనకు నచ్చని మీడియా సంగతి చూస్తానని చెబుతున్నారు. అదన్నమాట ఈయన ప్రజాస్వామ్యం. 

చంద్రబాబులో ఆ అసహనం ఎందుకో?
ఈ మధ్యకాలంలో చంద్రబాబు ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేయడానికి యత్నిస్తున్నారు. పోలీసులూ.. ఖబడ్దార్.. మీ అంతు చూస్తా.. జాగ్రత్తగా ఉండండి. అధికారంలోకి వచ్చాక మీరు ఎక్కడ ఉన్నా వెతికి మరీ మీ సంగతి చూస్తా! అని చంద్రబాబు పదే,పదే వ్యాఖ్యానిస్తున్నారు.ఏ ఊరు వెళితే ఆ ఊరు  వైసీపీ  ఎమ్మెల్యేని నోటీకి వచ్చినట్లు దూషిస్తున్నారు. ఇక ప్రభుత్వాన్ని అయితే ఎంతగా తిడుతున్నారో చెప్పడానికి వీలులేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు. అయితే ఆయనకు వయసుపైబడి అసహనానికి గురి అవడం అన్నా కావాలి.

లేదా తను ఎంత అబద్దాలు ప్రచారం చేస్తున్నా జనంలో తాను ఆశించిన మార్పు రావడం లేదన్న కోపం అయినా అయి ఉండాలి. సర్వేలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్కు 25కి 24 లేదా 25 లోక్ సభ సీట్లు వస్తాయన్న సర్వే వెలువడిన దగ్గరనుంచి ఆయనలో ఈ ఆగ్రహం మరింతగా పెల్లుబుకుతోంది. ఆ క్రమంలో తనకు భజన చేయని మీడియాను కూడా దూషిస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏమి జరిగింది. ఒక రిపోర్టరు ఒక ప్రశ్న వేశారు. రాజమండ్రి ఎమ్.పి భరత్ అడిగిన విషయంపై  అభిప్రాయం అడిగారట.

వలంటీర్ల వ్యవస్థను ఉంచుతారా? తీసివేస్తారా? గ్రామ సచివాలయ వ్యవస్థను ఏమి చేస్తారు అని అడిగారట. దీనికి సీనియర్ నేత అయిన చంద్రబాబు ఏమి జవాబు ఇవ్వాలి. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామనో ,లేదనో చెప్పాలి. అలాగే సచివాలయ వ్యవస్థను ఎత్తివేస్తామనో, ,ఉంచుతామనో చెప్పాలి.అలాకాకుండా ప్రశ్న అడిగిన విలేకరిని, ఆయన పనిచేసే మీడియాను తిట్టవలసిన అవసరం ఏమి ఉంటుంది. 

ఏదో సాకు చూపి ఆ టీవీలను కూడా విమర్శిస్తున్నారు
ఏదైనా జవాబు చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడే కోపం వస్తుంది. నిజానికి ఎన్.టి.వి. , టీవీ 9 అంత ఏకపక్షంగా ఎవరికి అనుకూలంగా వ్యవహరించడం లేదు. అయినా చంద్రబాబు ఎందుకు ఇలా అన్నారంటే ఒక కారణం చెబుతున్నారు. ఈటీవీ, ఎబిఎన్ , టీవీ 5 మీడియాలు తెలుగుదేశంకు హోల్ సేల్ గా పనిచేస్తున్నందున జనంలో తమపై   నమ్మకం పోతోందని, దానివల్ల తమకు నష్టం జరుగుతోందని, ఎన్.టి.వి, టీవీ 9 లను వైసీపీ ఖాతాలో వేయాలని తద్వారా అవి కూడా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాయన్న భావన కల్పించాలని టీవీ 5 వారు చంద్రబాబుపై ఒత్తిడి చేశారని ఒక ప్రచారం జరుగుతోంది. తప్పని స్థితిలో చంద్రబాబు ఏదో సాకు చూపి ఆ టీవీలను కూడా విమర్శించడం ప్రారంబించారట. చివరికి అది ఎంతవరకు వెళ్లిందంటే వాటిపై బాన్ పెడుతున్నామని ప్రకటించేవరకు. చంద్రబాబుకు ఇది కొత్తకాదు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంపై ఏ మాత్రం విమర్శ చేసినా ఆయన సహించేవారు కాదు. నచ్చని జర్నలిస్టుల ఉద్యోగాలు తీసిఏయాలని యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చేవారు. ఆయన చెప్పిన మాట వినకపోతే ఆ చానళ్లు ఎపిలో కేబుల్ ద్వారా ప్రసారం కాకుండా చేసేవారు. 

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమ వార్తలు కవర్ చేస్తున్నారని సాక్షి, ఎన్.టీవీ మొదలైన చానళ్లపై ఆంక్షలు పెట్టారు.ఈనాడు, ఆంద్రజ్యోతి ,టీవీ 5 లు నిజంగానే ఆయన కోరుకున్నట్లు ఆయనకు బానిసల మాదిరే పనిచేస్తున్నాయి. చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తరహాలో పనిచేస్తూ టీడీపీకి ,ఎల్లోమీడియాకు తేడా లేదన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. అయినా ఆయనకు సంతృప్తి కలగడం లేదు. మీడియాలన్నీ తనకు అనుకూలంగానే ఉండాలని ,లేకుంటే వారిని దూషిస్తానని చంద్రబాబు అంటున్నట్లుగా ఉంది. ప్రతిపక్షంలోనే ఇలా ఉంటే నిజంగానే అధికారంలోకి వస్తే ఇంకెంత నియంతృత్వంతో ఉంటారో అన్న భావన సహజంగానే కలుగుతుంది. పైగా ప్రజల పక్షాన తాను ఉన్నట్లు నటిస్తున్నారు. నిజానికి ప్రజలు ఆయన పక్షాన లేరని గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. అయినా ఏదో రకంగా ప్రజలను మళ్లీ మభ్య పెట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. 

రోజూ మాచ్ ఫిక్సింగ్ మీడియా సమావేశాలు పెడతారనిపిస్తుంది. ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం ఆయన ఒక మాట చెప్పారు. తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఏమిటని, అంటూనే తాము పొత్తు పెట్టుకుంటామంటేనే వైసీపీ భయపడుతోందని అన్నారు. ఆ వ్యాఖ్య చేసినప్పుడు సహజంగానే అక్కడ ఉన్న మీడియా వారు ఒక ప్రశ్న వేయాలి. మరి మీరు ఒంటరిగా పోటీచేయడానికి భయపడుతున్నారా? అని ప్రశ్నించాలి. కాని ఎవరూ ఆ మాట అడగలేదు. ముఖ్యమంత్రి ని పట్టుకుని నోటికి వచ్చినట్లు దూషిస్తున్నప్పుడు అది సరైనదేనా అని మీడియా అడిగి ఉండాలి. కాని ఎప్పుడూ అలా చేయలేదు. నిజంగానే తన బానిసలుగా ఈనాడు, జ్యోతి, టీవీ 5లను ఆయన మార్చుకోగలిగారు. 

చంద్రబాబు మాత్రం ఘోరంగా బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు
మరి ముఖ్యమంత్రి జగన్.. టీడీపీ మీడియాను విమర్శించడం లేదా అని ప్రశ్నించవచ్చు. ఆయన టీడీపీ మీడియాను బెదిరించడం లేదు. బ్లాక్ మెయిల్ చేయడం లేదు. కాని వారు దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్నారని, వారిని నమ్మవద్దని మాత్రమే ప్రజలకు చెబుతున్నారు. నా నలభై ఏళ్ల అనుభవంలో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత నీచమైన కధనాలు గతంలో ఎప్పుడూ రాలేదు. ఒక ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన వార్తలు ఇస్తుండడం కూడా ఇప్పుడే చూస్తున్నాం. అయినా ముఖ్యమంత్రి వారిని ఇలా బెదిరించలేదు. కాని ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం ఇంత ఘోరంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. 

ఇక పోలీసులను సైతం దారుణంగా దూషిస్తున్నారు. వారు ఎంత ఓపికగా ఉన్నా , ఏదో ఒక పాయింట్ మీద వారిపై విరుచుకుపడుతున్నారు. పదమూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఇలా చేయడం అంటే తనను తాను కించపరుచుకోవడమే అవుతుంది.సబ్జెక్ట్ లేక , ప్రజలలో పరపతి పెరగక ఆయన ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. దానికి తోడు ఇటీవలి కాలంలో ఆయనపై కుంభకోణాల కేసుల దర్యాప్తునకు సుప్రింకోర్టు ఓకే చేయడం, అమరావతి రాజధాని కేసులలో కొన్ని ఎదురుదెబ్బలు తగలడం వంటి వాటి కారణంగా చంద్రబాబు పట్టరాని కోపంతో ఇలా ఎవరిమీద పడితే వారి మీద దూషణలకు దిగుతున్నారు. మరో ఏడాది కాలం జర్నలిస్టులు వీటిని భరించక తప్పదేమో! ఆ తర్వాత ఎన్నికలలో ఎటూ టీడీపీ గెలవదని సర్వేలు చెబుతున్నాయి కదా!

-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement