చౌటుప్పల్ రూరల్: తాను ఈ నెల 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నానని.. ఆ బహిరంగ సభను 2 లక్షల మందితో మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించనున్నామని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదాద్రి జిల్లా అంకిరెడ్డిగూడెం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రాజగోపాల్ కలిశారు. బహిరంగ సభ ఏర్పాట్లపై బండి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్, గంగిడి మనోహర్‌రెడ్డితో కలిసి చర్చించారు.
అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడి యాతో మాట్లాడారు. బుధవారం నుంచి మునుగోడులోని మండలాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని, బహిరంగ సభ అనంతరం గ్రామగ్రామాన తిరుగుతానన్నారు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి, నియోజకవర్గంలోని సమస్యలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. తనకు తిన్నది అరగడం లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయనకు చీము, నెత్తురు, సిగ్గు, శరం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, రాజీనామా చేయకుండానే పార్టీ మారాడని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, లేదంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఉప ఎన్నికలు రావచ్చన్నారు.
చదవండి: కేంద్రం నిధులు బొక్కేస్తున్న కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment