సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతుంటే ప్రధానమంత్రి నెమలితో సమయాన్ని గడపుతున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అంటే ఎవరి జీవితాలను వారే కాపాడుకోవడమని అర్ధం అన్నారు. మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తుంటే ప్రధానమంత్రి మోదీ నెమలితో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు 50 లక్షలకు చేరువైన నేపథ్యంలో రాహుల్ మోదీ సర్కార్ తీరుపై సోమవారం వరుస ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.
అహంకారపూరిత ధోరణితో అప్రకటిత లాక్డౌన్ కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి పెరిగిపోయిందని అన్నారు. ఇక పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. తన తల్లి సోనియా గాంధీ హెల్త్ చెకప్ కోసం ఆయన గత వారం విదేశాలకు వెళ్లారు. ప్రధానిపై ట్వీట్లతో విరుచుకుపడిన రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రధానమంత్రి నెమలితో గడుపుతున్న వీడియోను పోస్ట్ చేశారు. అందులో ప్రధాని మోదీ నెమలితో నడుస్తూ వ్యాయామాలు చేస్తుండటం కనిపించింది. ఇక కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ రాహుల్ ట్వీట్లకు దీటుగా బదులిస్తూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ల పార్టీగా మారిందని చురకలు వేశారు. ఆ పార్టీ ప్రజల కోసం పనిచేయడం లేదని, దీంతో రోజుకు ఒక నాయకుడు కాంగ్రెస్‌ను వీడుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment