సాయిగణేష్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
అలంపూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుద్ధి చెప్పేందుకు పేదోళ్ల రాజ్యం రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్ మంత్రుల అవినీతి, దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం నాలుగోరోజు కొనసాగింది.
బోరవెల్లి, జల్లాపురంలో ప్రజల గోస–బీజేపీ భరోసా పేరిట నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పేదోళ్లకు పైసలిస్తే ఓట్లేస్తరనే దురాలోచనలో కేసీఆర్ ఉన్నారని సంజయ్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పాలనలో పోలీసులకు ప్రమోషన్లు రావు కానీ.. టీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతో బీజేపీ కార్యకర్తలపై దాడులు, లాఠీచార్జ్ జరుగుతాయని విమర్శించారు. కులాలు, మతాలు, సంఘాలను కేసీఆర్ చీల్చుతూ చిచ్చు రేపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఒక్కొక్కరి తలపై రూ.లక్ష అప్పుల భారం మోపారని ఆరోపించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్ల జాడ లేదన్నారు.
కేసు నమోదు చేయాలి: ఖమ్మం జిల్లాలో స్థానిక మంత్రి, పోలీసులు, టీఆర్‌ఎస్ గూండాల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ మరణ వాంగ్మూలం ఆధారంగా బాధ్యులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు సాయిగణేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, యాత్ర ప్రముఖ్ మనోహర్‌రెడ్డి, బీజేపీ నాయకులు బొడిగె శోభ, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment