సాక్షి, న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ గురిపెట్టింది. ప్రధానంగా తెలంగాణలో అధికార పీఠం ఎక్కేందుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో కనీసం 65 అసెంబ్లీ స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సోమవారం నుంచి ఆరంభమైన జాతీయ కార్యవర్గ భేటీల్లో ఈ మేరకు రాష్ట్ర ఇంచార్జులు, నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో అధికారంతోపాటు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 12 పార్లమెంట్ స్థానాలు దక్కించుకునే వ్యూహాలపైనా కేంద్ర నాయకత్వం మార్గదర్శనం చేసింది.
మెరుగ్గా ఉంది.. అందిపుచ్చుకోండి
బీజేపీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు సోమవారం ఢిల్లీలో మొదలయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కేంద్రమంత్రులు, 12 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులతోపాటు మొత్తం 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఇంద్రసేనా రెడ్డి, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి హాజరుకాగా, ఏపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, మాధవ్ హాజరయ్యారు.
సమావేశంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తెలంగాణ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి తొమ్మిది రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల వ్యూహంపైనా చర్చించారు. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, కాంగ్రెస్ రోజురోజుకీ డీలా పడిపోతున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అగ్ర నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో రాష్ట్ర నేతల పర్యటనలు పెంచాలని, కేంద్ర నాయకుల పర్యటనలు సైతం బలహీన నియోజక వర్గాల్లో ఎక్కువగా ఉండేలా చూడాలని సూచనలు చేసినట్లు చెబుతున్నారు.
వీటితోపాటు ఫిబ్రవరిలో పార్టీ నిర్వహించే 10వేలకు పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను విజయవంతం చేసేలా ఇంచార్జులు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇక లోక్‌సభ ప్రవాస్ ప్రచారం కింద ఈ నెల 28న అమిత్‌షా తెలంగాణలో పర్యటించే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా పర్యటన తర్వాత ప్రతి నెలలో కనీసం 10 మంది జాతీయస్థాయి నేతలు రాష్ట్రంలో పర్యటించి, పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ఉంటుందని అంటున్నారు. ఇటీవలి బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలు విజయవంతమైనందున ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పాదయాత్రల నిర్వహణపై ఇతర రాష్ట్రాల నేతలకు సూచనలు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment