![Vijaya Sai Reddy Fires On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/28/VIJAYA-SAI-REDDY.jpg.webp?itok=ZWnpeptk)
సాక్షి, అమరావతి: కుప్పం నియోజకవర్గానికి 33 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు మరో 13 ఏళ్లకైనా రాజకీయ పరిపక్వత రాదేమోనని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి దెప్పి పొడిచారు. మూడేళ్ల.. మూణ్నెళ్ల క్రితం రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో చంద్రబాబు పోల్చడం సిగ్గుచేటన్నారు.
టీడీపీని ప్రజాస్వామ్యం లేని పేద (ఉత్తర) కొరియా పాలకపక్షం తరహాలో నడపాలనుకుంటున్న నారావారిపల్లె నేతకు కిమ్ ఆదర్శప్రాయుడు కావచ్చేమోనని ఎద్దేవా చేశారు. ఉత్తర కొరియాకు ఏ రకంగానూ ఆంధ్రప్రదేశ్‌తో పోలిక లేదని, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నియంత కిమ్‌తో ఏ విధంగానూ సారూప్యం లేదని వివరించారు. కిమ్‌తో ఏపీ సీఎంను పోల్చడం చంద్రబాబు అవగాహనా రాహిత్యానికి పరాకాష్టగా అభివర్ణించారు.
సంపన్న సోదర దేశం దక్షిణ కొరియాకు పూర్తి విరుద్ధమైన ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదని.. సైనిక పాలనతో ఈ పేద కొరియా కునారిల్లుతోందని గుర్తు చేశారు. చంద్రబాబు చలువతో సైజు కుదించుకుపోయిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో తండ్రీ కొడుకుల ఐదేళ్ల పాలన తర్వాత కూడా ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందని.. పౌర హక్కులను ఇక్కడి రాజ్యాంగ వ్యవస్థలు కాపాడుతున్నాయని.. ఈ వ్యవస్థలను పరిరక్షించే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చక్కగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు.
రెండు పొరుగు రాష్ట్రాల నీడన ఇంకా వెనుకబడి ఉన్న కుప్పంలో మూడు రోజులు కుప్పిగంతుల తర్వాత చంద్రబాబునాయుడు తన నాటకాలకు తెర దించడం సంతోషమని ఎద్దేవా చేశారు. కుప్పం నుంచి పోతూపోతూ ఆంధ్రప్రదేశ్‌ని జనరంజకంగా పాలిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభాండాలు వేయడం చంద్రబాబు వయసుకు తగని పని అని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment