పెద్దారవీడు/మార్కాపురం: నడిరోడ్డుపై మరణ మృదంగం. అతివేగం ఆరుగురి ప్రాణాలను మింగేసింది. అప్పటి వరకూ శుభకార్యంలో బంధువులతో సంతోషంగా గడిపి ఇంటికి కారులో బయలుదేరిన వారి ప్రాణాలు దారిలోనే గాల్లో కలిసిపోయాయి. క్రిస్మస్ పండుగకు దుస్తులు కొనుక్కునేందుకు మార్కాపురం బయలుదేరిన అన్నదమ్ములిద్దరూ విగతజీవులుగా మారిపోయారు. అప్పటి వరకూ కళాశాలలో పాఠాలు విని ఇంటికి వెళ్తున్న విద్యార్థులు తీవ్రగాయాల పాలై ప్రాణాలతో పోరాడుతున్నారు. ఘటన ప్రదేశానికి మార్కాపురం పట్టణం కేవలం పది కిలోమీటర్లు. అంటే పదిహేను నిమిషాలు ఆగితే ఆటోలో వారి ప్రాణాలు దక్కేవి. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక కారులో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
ఈ హృదయ విదారకర ఘటన అందర్నీ కలచివేసింది. కొమరోలులో బంధువు రాయి వెంకటేశ్వరరావు గృహప్రవేశానికి గుంటూరు చంద్రమౌళినగర్‌కు చెందిన రాయి నాగేశ్వరరావు, రాయి వెంకటేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు రెండు కార్లలో వెళ్లారు. గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకుని మధ్యాహ్నం భోజనం ముగించుకుని సుమారు రెండు గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఒక కారు ముందు వెళుతుండగా రాయి వెంకటేశ్వరావు, నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు వెనుక వస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న ఆటోను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరొకరు దుర్మణం చెందారు.
విద్యార్థుల రోదనలతో...
విద్యార్థుల రోదనలతో మార్కాపురం జిల్లా వైద్యశాల మార్మోగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన నలుగురిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో దోర్నాలకు చెందిన ఉప్పలపాటి డానియేల్ (30), త్రిపురాంతకం మండలం దూపాడుకు చెందిన రత్నతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రత్నతేజ సోదరుడు అభినయ్ ప్రమాద స్థలంలోనే దుర్మరణం చెందాడు. దుస్తులు కొనుగోలు చేసేందుకు మార్కాపురం బయలుదేరిన అన్నదమ్ములిద్దరూ మృత్యువాతపడడం ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. దూపాడు గ్రామానికి చెందిన అభినయ్ పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో కేంద్రియ విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్నాడు.
మార్కాపురం పట్టణ శివారులోని ఒక ప్రైవేటు అగ్రికల్చర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న మైథిలి, రెండో సంవత్సరం చదువుతున్న ముర్షీదా, కమీరూన్‌లది కర్నూలు. వీరంతా కళాశాలలో తరగతులు ముగిసిన అనంతరం మార్కాపురం వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ప్రమాదంలో వారికి కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కుటుంబానికి ఆధారమైన ఆటో డ్రైవర్ షేక్ బాబు మృతి చెందడంతో అతని భార్య రమీజా, ముగ్గురు ఆడ పిల్లలు గుండెలవిసేలా రోదించడం అందర్నీ కలచివేసింది. ఇదిలా ఉండగా ముందువెళ్తున్న కారులోని వారు వెనుక కారు కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చారు. ప్రమాదంలో మృత్యువాత పడిన నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావును చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment