ఎయిడెడ్‌ ఉద్యోగులపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ ఉద్యోగులపై నిర్లక్ష్యం

Published Mon, Sep 9 2024 3:02 AM | Last Updated on Mon, Sep 9 2024 3:02 AM

-

ఒంగోలు: ఎయిడెడ్‌ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నెలల తరబడి వారికి జీతాలు అందడంలేదు. ప్రతి రోజు విధులకు హాజరవుతున్నా జీతం ఎప్పుడు వస్తుందో తెలియని స్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలలకుపైగా జిల్లాలో 29 మంది ఎయిడెడ్‌ సిబ్బంది జీతం అందక ఇబ్బందులు పడుతున్నారు.

జీతాల విడుదలలో జాప్యం:

ఎయిడెడ్‌ పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ప్రక్షాళన జరిగింది. ఆస్తులతో సహా ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించడం (లేదా) ఆస్తులు లేకుండా ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించడానికి అవకాశం కల్పించారు. దీంతో చాలా ఎయిడెడ్‌ పాఠశాలలు కొన్ని దశాబ్దాలుగా ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం, విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో వారు తమ ఆమోదాలను ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే కొన్ని పాఠశాలలు మాత్రం న్యాయస్థానాలను ఆశ్రయించి పోస్టుల భర్తీకి అనుమతి పొందాయి. దీంతో విద్యాశాఖ వర్గాల ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియ ముగించారు. ఇలా ఈతముక్కల పాఠశాలలో 7, చేకూరపాడు పాఠశాలలో 7, ఒంగోలు గద్దలగుంట పాఠశాలలో ఏడుగురు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులు, ఒకరు సెకండరీ గ్రేడ్‌ టీచరు, గిద్దలూరు మండలం కొత్తపల్లిలో ఒక పోస్టు, అద్దంకి ప్రకాశం ఎయిడెడ్‌ పాఠశాలలో రెండు, కనిగిరిలో రెండు స్కూల్‌ అసిస్టెంట్‌, మరో రెండు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేశారు. 2023 డిసెంబర్‌, ఆ తరువాత విధుల్లో చేరారు. వీరిలో 9 నెలలుగా జీతాలు అందుకోని వారు కొందరైతే, మరికొందరు ఆరు నెలలుగా జీతాలు అందుకోని వారు ఉన్నారు.

వేధిస్తున్న ఎంటీఎస్‌ సమస్య:

వీరంతా కోర్టు ఆదేశాలతో యాజమాన్యాలు పత్రిక ప్రకటన, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్‌మెంట్‌ పూర్తిచేశారు. ప్రొబేషన్‌ పీరియడ్‌లో మినిమం టైమ్‌ స్కేలు ఇవ్వాలని, ప్రొబేషన్‌ పూర్తయిన తరువాత రెగ్యులర్‌ స్కేల్‌ ఇవ్వాలంటూ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం నెలలు గడుస్తున్నా కనీసం ఖజానా శాఖలో ఎంప్లాయి ఐడీకి నోచుకోలేదు.

జీతాలు వెంటనే విడుదల చేయాలి

నూతనంగా నియమించిన ఎయిడెడ్‌ టీచర్లకు జీతాలు విడుదలలో జాప్యం తగదు. తక్షణమే వారికి జీతాలు చెల్లించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం ఒక్క విద్యార్థి కూడా లేని ఎయిడెడ్‌ పాఠశాలల్లో 96 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిని ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ముందుకు సాగడంలేదు.

– సీహెచ్‌ ప్రభాకరరెడ్డి , ఏపీటీజీ జిల్లా ప్రధాన కార్యదర్శి

6 నెలలుగా అందని జీతాలు జిల్లాలో 29 మంది ఉద్యోగుల పరిస్థితి ఇది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement