అనారోగ్యం రాదా..?
నాణ్యమైన మద్యం తాగితే
● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: టీడీపీ కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం ఇస్తామని చెబుతోందని, ఈ మద్యం తాగితే అనారోగ్య సమస్యలు రావా అని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. జరుగుమల్లి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన వావిలేటిపాడు గ్రామం వచ్చిన సందర్భంగా విలేకరులతో మద్యం టెండర్లపై మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం టెండర్ల ద్వారా టీడీపీ నాయకుల అరాచకపాలన బట్టబయలైందన్నారు. మద్యం టెండర్ల విషయంలో ప్రతి ఎమ్మెల్యే వీధి రౌడీలా మారి తాము చెప్పిన వారే టెండర్లు వేయాలని, ఒక వేళ వేసినా షాపు నిర్వహించకుండా అడ్డుకుంటామని, షాపు మాకు అప్పగించాల్సిందే.. అని బెదిరిస్తున్నారన్నారు. మరో వైపు సీఎం చంద్రబాబు పార్టీ నాయకులు అవినీతికి పాల్పడితే సహించేది లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. మరొకతనేమో సనాతన ధర్మమని తిరుగుతాడు వీళ్లేమో అరాచకపాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు వీరు చేస్తున్న అరాచక పాలనను గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనను వైఎస్సార్ సీపీ కచ్చితంగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. తమ పార్టీ ఎల్లప్పుడూ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉందన్నారు. మద్యపాన నిషేదాన్ని అమలు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment