ఉచిత ఇసుకకు ధరల నిర్ణయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇసుక దందా మొదలుపెట్టారు. ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు తెలుగు తమ్ముళ్లు ఇసుక స్టాక్ పాయింట్లను తమ స్వాధీనంలోకి తీసుకొని రాత్రికి రాత్రే తరలించుకొనిపోయారు. రోజుల వ్యవధిలోనే స్టాక్ మొత్తం తరలించేసి ఉత్త చేతులు చూపారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక అందజేస్తున్నామని చెబుతూ ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారు. మరోవైపు టన్ను రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఇసుక ఉచితమే.. లోడింగ్ చార్జీలు మాత్రమే చెల్లించమంటున్నామంటూ కబుర్లు చెబుతున్నారు. ఈ నాటకాలు చూసిన ప్రజలు కడుపు మండి ఇదేంటన్యాయం అని ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారంటూ పోలీసులను ఉసి గొలిపి కేసులు బనాయిస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర కూటమి పాలకులు కొత్త ఎత్తుగడ వేశారు. మద్యం వ్యాపారం తరహాలో ఇసుక వ్యాపారాన్ని కూడా తెలుగు తమ్ముళ్లకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇసుక స్టాక్ పాయింట్లకు లైసెన్సుల మంజూరు పేరుతో ఇసుక దందాకు తెరదీశారు.
లారీ ఇసుక రూ.17,640
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం ఒక లారీ ఇసుక ఒంగోలులో రూ.17,640 పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే గిద్దలూరులో అయితే రూ.21,600, మార్కాపురం రూ.23,040, యర్రగొండపాలెం రూ.27 వేలు, కనిగిరి రూ.17,640, దర్శి రూ.22,140 అవుతుంది. ఈ లెక్కన ట్రాక్టర్ ఇసుక ఒంగోలు రూ.3,920, గిద్దలూరు రూ.4,800, మార్కాపురం రూ.5,120, యర్రగొండపాలెం రూ.6 వేలు, కనిగిరి రూ.3,920, దర్శి రూ.4,920 అవుతుంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధరలకు విక్రయిస్తేనే. స్టాక్ పాయింట్ సమీపంలో ఉన్న వినియోగదారుడి కంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వినియోగదారుడిపై రవాణా ఖర్చులు అదనంగా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పడతాయి. అంటే టన్ను ధర కనీసం రూ.1500 వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసే ఇసుక ఉచితం ఎలా అవుతుందో పాలకులే చెప్పాలి.
అయినా సరే నో స్టాక్
వేలాది రూపాయల ఖరీదు చేసే ఉచిత ఇసుక కొనాలంటే అందరికీ దొరికే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు రికమెండ్ చేసిన వారికి, కూటమి శ్రేణులకు మాత్రమే ఇసుక లభిస్తుంది. మిగిలిన సామాన్య ప్రజలు, భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందని ద్రాక్షలా తయారైంది. ఆన్‌లైన్లో బుక్ చేసుకున్నా ఇసుక నో స్టాక్ అని చూపుతుంది. దాంతో ఇసుక కోసం తెలుగుదేశం నాయకుల ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. ఇసుక వ్యాపారం వారి చేతుల్లో ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు.
రోడ్డున పడిన భవన నిర్మాణ కార్మికులు:
ఇసుక కొరత, ధరలు పెరిగిపోవడంతో భవన నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. దాంతో పనులు లేక వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. జిల్లాలో సుమారు 1.51 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక దొరకడం గగనమైపోవడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 5 నెలలుగా జిల్లాలో భవన నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రభుత్వ భవనాల పనులు కూడా జరగడం లేదు. దీంతో భవన నిర్మాణాలపై పెను భారం పడింది. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలనుకున్నవారు కూడా ఈ పరిస్థితి చూసి వెనకంజ వేశారు. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులకు చేతిలో పనులు లేక రోడ్డున పడ్డారు. ఇళ్లు గడవడం కష్టమై కుటుంబాలు పస్తులతో గడుపుతున్నారు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నా పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.
ఇసుక ఉచితం అంటూనే రాష్ట్ర ప్రభుత్వం లోడింగ్ చార్జీల పేరుతో ధరలు నిర్ణయించింది. జీవోఎంఎస్ 66, 25.10.2024 ప్రకారం ఉచిత ఇసుక విధానం–2024కు సంబంధించి విధి విధానాలను ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి వరకు ఇసుక రీచ్‌ల వద్ద వసూలు చేస్తున్న సీనరేజి, డీఎంఎఫ్, మెరిట్ రుసుములను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే ఉత్తర్వులో ప్రకాశం జిల్లాలో ఇసుక రీచ్‌లు లేనందున సాధారణ ఇసుక వినియోగదారులు సరిహద్దు జిల్లాల ఇసుక రీచ్‌ల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన లోడింగ్ చార్జిలను చెల్లించి కావలసినంత ఇసుక కొనుక్కోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇలా ఉన్నాయి.
ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఉచిత ఇసుక అడ్రస్ లేదు. గతంలో కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ట్రక్కు ఇసుక రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు అవుతోంది. దీంతో భవన నిర్మాణాలు ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజలు నిర్మించుకోవడం అసాధ్యమవుతుంది. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇసుక ఉచితంగా పంపిణీ చేయాలి.
– జి.శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఒంగోలు.
ట్రాక్టర్ ఇసుక రూ.5 వేలకు అమ్ముతున్నారు
ఇసుక ధరలు తగ్గకపోవడం, సరిపడా ఇసుక అందుబాటులో లేకపోవడంతో బేల్దారి పనులు లేవు. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక రూ.5 వేల వరకు అమ్ముతున్నారు. దీంతో ఇంటి నిర్మాణాలు చేసుకునేవారు ధరలు తగ్గాక పనులు మొదలు పెట్టుకుందామని పనులు వాయిదా వేసుకుంటున్నారు. పనులు దొరక్కపోవడంతో ఆటో నడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇసుక ధరలు తగ్గించి ప్రజలకు అవసరమైన మేర ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలి.
– నందిపాటి అచ్చయ్య, బేల్దార్ మేస్త్రి, కంభం
Comments
Please login to add a commentAdd a comment