తర్లుపాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా తర్లుపాడుకు చెందిన భవనం రామచంద్రారెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అనుబంధ కమిటీల నియామకం, అనుబంధ విభాగ కార్యక్రమాల సమన్వయ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారని పేర్కొంది.
17న మల్లవరంలో బ్రాహ్మణ కార్తీక సమారాధన
ఒంగోలు మెట్రో: మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణ అన్నదాన సత్రంలో ఈనెల 17వ తేదీ ఆదివారం బ్రాహ్మణ కార్తీక సమారాధన నిర్వహిస్తున్నట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు. 17వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు అల్పాహారం, తొమ్మిది గంటలకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కార్తీక దామోదర పూజ, 11 గంటలకు భక్తుల చేత సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేస్తారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బ్రాహ్మణ సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.
17న కాపు కార్తీక వన భోజనాలు
ఒంగోలు వన్‌టౌన్: కాపు కార్తీక వనభోజనాలు ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కే సంజీవకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలులోని కాపు సంఘ కార్యాలయంలో శుక్రవారం కార్తీక వనభోజన మహోత్సవ ఆహ్వాన కమిటీ సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని డి6 ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీ శ్రీనివాసమూర్తి, యు శ్రీనివాసరావు, కే నారాయణ, పీ ఫణీంద్ర కుమార్, బీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, చదువును కొనసాగిస్తూనే క్రీడల్లో కూడా ప్రతిభ చూపించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన పుల్లలచెరువు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని బి.వెంకటమ్మకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బహుమతితో రూ.5 వేల నగదు అందజేశారు. సైబర్ నేరాల నివారణలో యువత పాత్ర అనే అంశం మీద బి.వెంకటమ్మ ఆలోచనాత్మక సూచనలు చేసినట్లు కొనియాడిన ఎస్పీ ఆమె చదువు, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలనధిరోహించే లక్ష్యంతో ప్రణాళికా బద్దంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్టాఫ్ నర్స్ బి.విజయలక్ష్మి పాల్గొన్నారు.
తప్పించుకున్నారా.. తప్పించారా ?
● ముగ్గురు నిందితులు పారిపోయారని చేస్తున్న ప్రచారంలో నిజమెంత ?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు నిందితులు తప్పించుకొని పరారవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇటీవల మోటారు బైకుల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిఘా పెట్టారు. గత సోమవారం నలుగురు నిందితులు పోలీసులకు చిక్కారు. అయితే బుధవారం పోలీసుల కస్టడీ నుంచి కౌశిక్, శివ, రఫి అనే ముగ్గురు నిందితులు పరారయ్యారు. మరొక నిందితుడిని వెంటపడి పోలీసులు పట్టుకున్నట్లు చెబుతున్నారు. ఒకేసారి ముగ్గురు నిందితులు పోలీసుల కస్టడీ నుంచి పరారవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలులో తాలూకా, రూరల్, వన్‌టౌన్, టూ టౌన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. నిందితులను ఈ నాలుగు స్టేషన్లలో ఎక్కడైనా ఉంచి విచారణ చేయవచ్చు. కానీ డీఎస్పీ ఆఫీసులో ఆవరణలో శిథిలమైన పోలీసు క్వార్టర్స్‌లోని ఒక గదిలో నిందితులను ఉంచినట్లు సమాచారం. వారికి కాపలాగా ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు. నిందితుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆ శాఖకు చెందిన కొందరు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ సమయంలో నిందితులు చేతికి వేసిన సంకెళ్లను తీసుకొని పారిపోయారని పోలీసులు చెప్పడం నమ్మశక్యంగా లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నలుగురు నిందితులు చేతికి వేసిన సంకెళ్లు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి నిందితులను ఉద్దేశపూర్వకంగానే వదిలి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. లోతుగా విచారణ జరిపితే ఈ ఘటన వెనక ఉన్న పోలీసుల పాత్ర బయటకు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment