జిల్లా స్థాయి త్రోబాల్ క్రీడలకు క్రీడాకారుల ఎంపిక రేపే
దర్శి: మండలంలోని చందలూరు పాఠశాలలో జిల్లా స్థాయి త్రోబాల్ జూనియర్ బాలబాలికల క్రీడల ఎంపిక బుధవారం చందలూరు పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీఎం నరశింహారావు ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. చందలూరు పాఠశాలలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జనవరి 2006 తరువాత జన్మించిన వారు ఈ క్రీడా పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పీడీ అంజిరెడ్డి వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ నెల 21, 22 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. పూర్తి వివరాలకు 9985357903 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
నేడు వెల్ఫేర్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్
ఒంగోలు సెంట్రల్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్స్‌కు మంగళవారం ఒంగోలు డ్వామా కార్యాలయంలో బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి లక్ష్మా నాయక్ తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 312 మంది వెల్ఫేర్ అసిస్టెంట్స్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. వెల్ఫేర్ అసిస్టెంట్స్ సకాలంలో బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు.
మూడు గ్రామాల సచివాలయాలకు జీతాలు కట్ !
● సచివాలయ సిబ్బందిపై ఈఓఆర్‌డీ కక్షపూరిత చర్యలు
పీసీపల్లి: సచివాలయ సిబ్బందిపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని పెదయిర్లపాడు, వెంగళాయపల్లి, లక్ష్మక్కపల్లి సచివాలయాల సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్నారు. సచివాలయాలకు ప్రతి నెలా 20వ తేదీ జీతాల బిల్లులు పంపకుండా ఈఓఆర్‌డీ మల్లేశ్వరి వేధిస్తోందని సిబ్బంది వాపోతున్నారు. కింది స్థాయి సిబ్బందిపై విధుల విషయంలోనూ ఈఓఆర్‌డీ వేధిస్తోందని సిబ్బంది ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డికి సోమవారం వినతి పత్రం అందించారు. ప్రభుత్వ లక్ష్యాలు, పథకాలు ప్రజలకు మరింత చేరువలో అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయ సిబ్బందిపై ఇలా కర్కశంగా వ్యవహరించడం బాధాకరంగా ఉందని మహిళా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోతే తామెలా బతకాలని ఉద్యోగస్థులు ఎంపీడీఓకు అందించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై ఈవోఆర్డీ మల్లేశ్వరిని వివరణ కోరగా సిబ్బంది కొరతతో అన్నీ తానే చూసుకుంటున్నానని, మూడు పంచాయతీల సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమయపాలన పాటించడం లేదని, విధుల్లో సహకరించకపోవడంతో జీతాలు ఆలస్యమయ్యాయని చెప్పారు. దీనిపై ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సిబ్బంది జీతాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈవోఆర్డీ మల్లేశ్వరిపై విచారణకు ఆదేశించానన్నారు. మూడు సచివాలయాల సిబ్బందికి త్వరలో జీతాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment