కలెక్టరేట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం
ఒంగోలు టౌన్: తన కుమారుడికి కలెక్టరేట్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మోసం చేశాడని ఒంగోలుకు చెందిన మహిళ ఒకరు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదు చేశారు. మాయమాటలతో నమ్మించిన సదరు వ్యక్తి తన వద్ద నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడని, ఉద్యోగం రాకపోవడంతో తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తనవద్ద ఉన్న ఆర్థోపెడిక్ స్కానింగ్ మిషన్‌ను తీసుకెళ్లిన నెల్లూరుకు చెందిన వ్యక్తి అద్దె చెల్లించకుండా వేధిస్తున్నాడని మెడికల్ ఆఫీసర్ ఒకరు ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 వేల చొప్పున చెల్లించేలా అగ్రిమెంటు చేసుకొన్న సదరు వ్యక్తి తొలుత సక్రమంగానే అద్దె చెల్లించాడని, ఆ తరువాత సంవత్సరం నుంచి అద్దె చెల్లించకుండా మోసం చేస్తున్నాడని వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 68 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ ఎస్పీ (క్రైం) ఎస్ వీ శ్రీధర్ రావు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చట్టప్రకారం విచారణ జరిపి సత్వర న్యాయం చేకూరుస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తాలుకా సీఐ అజయ్ కుమార్, ప్యానల్ అడ్వొకేట్ బీవీ శివరామకృష్ణ, ప్రజా సమస్యల పరిష్కారవేదిక ఎస్‌ఐలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment