కంభం/బేస్తవారిపేట:
జిల్లాలోని విజ్ఞాన భాండాగారాల తలుపులు సిబ్బంది కొరత కారణంగా తరచూ మూతపడుతున్నాయి. పుస్తకాలు చదువుకునేందుకు ఆసక్తిగా గ్రంథాలయాల వైపు అడుగులు వేసిన వారు అక్కడి దృశ్యాలను చూసి నిరాశగా వెనుదిరుగుతున్న దుస్థితి. లైబ్రరీలను అరకొరగా తెరుస్తుండటంతో పుస్తక పఠనాన్నే వ్యాపకంగా మార్చుకున్న విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు, అలాగే చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారంతా నెలలో సగం రోజులు కూడా గ్రంథాలయంలో అడుగుపెట్టలేకపోతున్నారు. గతంలో అందుబాటులో ఉన్న గ్రామీణ గ్రంథాలయాలు కూడా ప్రస్తుతం పనిచేయడం లేదు. అతి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న బుక్ డిపాజిట్ సెంటర్లలో దినపత్రికలు మాత్రమే ఉంటున్నాయి. వీరు అవసరమైనవారికి ఇతర గ్రంథాలయాల నుంచి పుస్తకాలు తెచ్చి పాఠకులకు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రజలు ఎక్కువగా గ్రంథాలయాలపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో సక్రమంగా తెరవని కారణంగా సమాచారం కోసం ఇబ్బంది పడుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలో 66 గ్రంథాలయాలు ఉండగా 30 చోట్ల లైబ్రేరియన్ల కొరత వేధిస్తోంది. అన్ని లైబ్రరీల్లో కలిపి 104 మంది సిబ్బందికిగాను 34 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో గ్రంఽథపాలకుడు రెండు లేదా మూడు లైబ్రరీలను చూసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల గ్రంఽథపాలకులు లేక జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, అటెండర్లతో నెట్టుకొస్తున్నారు. జిల్లాలో సుమారు 50 గ్రంథాలయాలు వారానికి 3 నుంచి 4 రోజులు మాత్రమే తెరుస్తున్నారు. లైబ్రేరియన్ ఒకచోట విధులు నిర్వర్తిస్తుంటే.. ఇన్‌చార్జిగా ఉన్న గ్రంథాలయాలకు తాళం పడుతోంది. దీంతో అక్కడి పాఠకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా సగానికి పైగా లైబ్రరీల్లో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి, ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు, విద్యార్థులకు గ్రంథాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment