జీజీహెచ్‌లో కంగారు మదర్ కేర్ సెంటర్
● కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడి
ఒంగోలు టౌన్: బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు జీజీహెచ్‌లో కంగారు మదర్ కేర్ సెంటర్(కేఎంసీ) ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా వెల్లడించారు. మంగళవారం ఆమె జీజీహెచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. న్యూ బార్న్ మదర్ కేర్ కార్యక్రమంలో భాగంగా కనిగిరి సీహెచ్‌సీలో కేఎంసీ పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో భాగంగా జీజీహెచ్‌లోని గైనిక్, నవజాత శిశు విభాగాలను పరిశీలించినట్లు తెలిపారు. కంగారు తన పిల్లలను సహజసిద్ధమైన పొత్తిళ్లలో దాచి ఎలా సంరక్షిస్తుందో అదే తరహాలో నెలలు నిండకుండా పుట్టిన శిశువులను, బరువు తక్కువగా పుట్టిన చిన్నారులను కాపాడేందుకు కేఎంసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. సరైన విధానంలో పాలు పట్టడం, పోషణ, శుభ్రత తదితర అంశాలపై తల్లుకు అవగాహన కల్పించడమే కేఎంసీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
టాయిలెట్ల నిర్వహణపై అసంతృప్తి
సుమారు రెండు గంటలపాటు జీజీహెచ్‌లోని లేబర్ రూమ్‌తోపాటు గైనిక్ వార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వార్డులు, మరుగుదొడ్లలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత హెడ్ నర్సులకు చార్జ్ మెమో ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. జీజీహెచ్‌లో ప్రసవాల తీరు, క్రిటికల్ కేర్ ప్రొసీజర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నవజాత శిశు కేంద్రాన్ని, పోషకాహార కేంద్రాన్ని పరిశీలించిన ఆమె పిల్లలతో గడిపారు. కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, పలువురు హెచ్‌ఓడీలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment