సీసాపై ‘ఎస్‌పి’ పర్మిషన్ ముద్ర
బెల్ట్‌లో ‘ఎస్పీ’ బ్రాండ్
ప్రీమియం బ్రాండ్‌లకు ప్రత్యేక కోడ్
ఎస్పీ అంటే బ్రాండ్ కాదు .. స్పెషల్ పర్మిషన్
గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు
జిల్లాలో 1500 నుంచి 2000 వరకు బెల్ట్ షాపులు
విక్రేతలందరూ అధికార పార్టీ వారే
బెల్టు షాపులపై దాడుల్లోనూ అధికారుల వివక్ష
జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ చూసినా బెల్టు షాపులే.. ఊళ్లన్నీ మత్తులో జోగుతున్నాయి. అధికార కూటమి నేతల అండదండలతో ఈ వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుల్ బాటిల్లా విరాజిల్లుతోంది. లైసెన్స్ దుకాణాల నుంచి బెల్టు షాపులకు తీసుకొచ్చిన మద్యం బాటిళ్లపై ఉన్న లేబుళ్లను తొలగించి విక్రయాలు చేస్తారు. అయితే ప్రీమియం బ్రాండ్‌ల విషయంలో కోడ్ పెట్టుకుని సరఫరా చేస్తున్నారు. ఎస్పీ అన్న కోడ్ ఉంటే దానిని ఎవరూ పట్టుకోరని బెల్టుషాపు నిర్వహణదారులే చెబుతున్నారు. ఎస్పీ అంటే బ్రాండ్ కాదు.. స్పెషల్ పర్మిషన్ అని పుష్పా స్టైల్లో గర్వంగా చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో బెల్టు దుకాణాల దందా ఏ స్థాయిలో సాగుతుందో అవగతమవుతోంది.
పొదిలి రూరల్: జిల్లాలో ప్రభుత్వం 171 మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు మంజూరు చేస్తే అనధికారికంగా 1500 నుంచి 2000 వరకూ బెల్టు షాపులు నడుస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో అధికార పార్టీ నేతల అండదండలతో మాఫియా రెచ్చిపోతోంది. లైసెన్స్ మద్యం షాపుల నుంచి ప్రతి రోజు బొలేరో, ఆటో, ద్విచక్ర వాహనాల ద్వారా మద్యం సీసాలను బెల్ట్ షాపులకు సరఫరా అవుతున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతున్న దీన్ని అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో మొత్తం 21 మద్యం దుకాణాలు ఉండగా, 260కి పైగా బెల్ట్ షాపులు, దర్శి నియోజకవర్గంలో లైసెన్సు దుకాణాలు 24 ఉండగా, బెల్ట్ దుకాణాలు మాత్రం 550 వరకు, కొండపి నియోజకవర్గంలో లైసెన్సు దుకాణాలు 20 ఉండగా, బెల్ట్ షాపులు మాత్రం 215 ఉన్నాయి. కనిగిరి నియోజకవర్గంలో 21 లైసెన్సు దుకాణాలు ఉండగా, 200కుపైగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక మార్కాపురం నియోజకవర్గంలో 150, గిద్దలూరు నియోజకవర్గంలో 160కి పైగా బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా ఇదే తరహా తంతు కొనసాగుతోంది.
మాటలకే పరిమితం..
బెల్టుషాపులు నిర్వహిస్తూ పట్టుబడితే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని సీఎం చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో బెల్టుషాపుల అమ్మకాలే అధిక మొత్తంలో ఉన్నాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులు వెలుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున బెల్టుషాపులు ఏర్పాటు కావడంతో తమ కాపురాలు నాశనమవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్యే మద్యం లభిస్తుండటంతో కూలి డబ్బులన్నీ మద్యానికే ఖర్చు చేస్తున్నారని పేద మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
క్వార్టర్‌పై రూ.50 నుంచి రూ.100కి పైగా అదనం
ప్రస్తుతం చాలా ప్రభుత్వం లైసెన్స్ మద్యం షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీకే విక్రయిస్తున్నారు. రాత్రి పది దాటితే మాత్రం ధరలు వారి ఇష్టం. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక బెల్ట్ దుకాణాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కడ కావాలంటే అక్కడ విక్రయాలు చేస్తున్నారు. సమయాన్ని బట్టి ఒక్కో సీసాపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా తీసుకుంటున్నారు.
బెల్టుషాపులపై దాడిలోనూ వివక్ష
బెల్టుషాపులపై అడపా దడపా దాడి చేసే విషయంలోనూ అధికారులు వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలు నిర్వహించే బెల్టుషాపుల వద్దకు దాడికి వచ్చే సమయంలో ముందుగా సమాచారం ఇస్తున్నారు. అదే ఇతర వ్యక్తులకు చెందిన వారి షాపుపై ఆకస్మిక దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మామూళ్ల మత్తులో అధికారులు..
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం బెల్ట్‌షాపులు పెట్టినా, అక్రమంగా మద్యం విక్రయించినా, ప్రభుత్వం అనుమతి లేకుండా ఎక్కడైనా కూర్చుని మద్యం తాగినా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ అధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో కార్య్లాయాలు దాటి బయటకు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్ పర్మిషన్ లేదు. కానీ పొదిలి సర్కిల్ పరిధిలోని అన్ని లైసెన్సు షాపుల వద్ద సిట్టింగ్ రూంలు ఏర్పాటు చేసి ప్రత్యేక బంకులు నిర్వహిస్తున్నారు. ఈ బంకులకు ఏ సమయంలో వెళ్లినా మద్యం దొరుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment