అర్జీలు చిత్తశుద్ధితో పరిష్కరించాలి
ఒంగోలు అర్బన్: గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు చిత్తశుద్ధితో నిర్ణీత గడువు లోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పక్కాగా పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణతో కలిసి సోమవారం మీకోసం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్య తిరిగి పునరావృతం కాకుండా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్జీదారులకు అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ సమస్యలపై సమీక్షిస్తామన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే వాటి కారణాలను వివరించాలన్నారు. కలెక్టర్ గ్రీవెన్స్‌లో 255 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, లోకేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● భాగ్యనగర్ సర్వే నంబర్ 7లో నాల్గవ తరగతి ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని కొంత మంది దొంగ పట్టాలతో వ్యాపారాలు చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోమటిగుంట వెంకటేశ్వర్లు గ్రీవెన్స్‌లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వే నెంబర్ 7లో 9.70 ఎకరాల భూమిని మార్కెట్ రేటుకు సంఘానికి కేటాయించారని, దానిలో నాల్గవ తరగతి ఉద్యోగులు 144 మందికి ప్లాట్లుగా విభజించి కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 1.10 ఎకరాల భూమిని కమ్యూనల్ పర్పస్ కోసం రిజర్వు చేసినట్లు వివరించాడు. అయితే కొంతమంది ఆ భూమిలో అక్రమ లేఅవుట్ సృష్టించి దొంగ పట్టాలతో వ్యాపారాలు చేస్తున్నారని, పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment