జాతీయస్థాయి పోటీలకు దొనకొండ విద్యార్థిని
దొనకొండ: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎనుబరా ప్రైసీ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 21, 22 తేదీల్లో కర్నూలు డీఎస్‌ఏ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపడంతో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహారావు తెలిపారు. ఈ నెల 28 నుంచి చైన్నెలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎనుబరా ప్రైసీకి అభినందన సభ ఏర్పాటు చేశారు.
27 లోగా అభ్యంతరాలు తెలియజేయాలి
ఒంగోలు వన్‌టౌన్: స్కూల్ క్లస్టర్ల సముదాయాలపై ఈ నెల 27వ తేదీ లోగా అభ్యంతరాలు తెలియజేయాలని జిల్లా విద్యాశాఖాధకారి ఏ కిరణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్కూలు క్లస్టర్ సముదాయాల వివరాల జాబితాను ఉప విద్యాశాఖాధికారి కార్యాలయాల వద్ద, మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల వద్ద ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యంతరాలను విద్యాశాఖ వెబ్‌సైట్ ద్వారా కుడా తెలపవచ్చన్నారు.
31 వరకు పరీక్ష ఫీజు చెల్లించొచ్చు
ఒంగోలు వన్‌టౌన్: పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 31వ తేదీ వరకూ చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె.శివకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియెట్‌లో ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్లు తమ వద్ద అడ్మిషన్లు పొందిన పదో తరగతి విద్యార్థుల ఫీజును చెల్లించాలన్నారు. అపరాధ రుసుం రూ.25లతో జనవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
సిబ్బంది బయోమెట్రిక్‌ను పర్యవేక్షించాలి
ఒంగోలు అర్బన్: సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని, ఆ ప్రక్రియను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రకాశంభవనం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో పలు అంశాలపై సోమవారం వీడియో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాఠశాల మరుగుదొడ్లు, అదృశ్యం కేసులు, మ్యాపింగ్, గృహనిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల్లో విధుల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించే వారిపై, దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరుతో జీతాలకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి జియో ట్యాగింగ్ పూర్తి చేసి అందరి బ్యాంకు ఖాతాలను ఎన్‌పీఐతో మ్యాపింగ్ చేయాలన్నారు. హౌస్‌హోల్డ్ క్లస్టర్లను ఆయా హ్యాబిటేషన్లు, పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలతో మ్యాపింగ్ చేయాలని సూచించారు. సచివాలయం వారీగా సున్నా నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల ఆధార్ అప్డేషన్ ప్రక్రియ నూరుశాతం పూర్తి చేయాలన్నారు. జనన ధృవీకరణ లేని పిల్లలకు సర్టిఫికెట్లు ఇప్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 3800 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యం ఉండగా ఇప్పటికే 2101 ఇళ్లు పూర్తి చేశారని, మిగిలినవి త్వరగా పూర్తి చేయాలన్నారు. తాగునీటి డిమాండ్‌ను గుర్తించి ఆ మేరకు పక్కాగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి పక్కాగా సర్వే చేపట్టాలన్నారు. నాట్ వర్కింగ్ యూనిట్లు వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలో 73 సచివాలయాల్లో ఇప్పటివరకు ఈ సర్వే చేపట్టలేదని, వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, సీపీఓ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాల శంకరరావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసప్రసాద్, పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు, ఐసీడీఎస్, మెప్మా పీడీలు హేనసుజన, రవికుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment