బాబు ష్యూరిటీ..బాదుడు గ్యారంటీ
సింగరాయకొండ: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ బిల్లులు పట్టుకుంటే షాక్ తగిలేలా సుమారు రూ.15 వేల భారం ప్రజలపై మోపిందని, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో పిడుగులు కురిపిస్తుందని ఆరోపించారు. నవంబర్‌లో రూ.6వేల కోట్లు, డిసెంబర్‌లో రూ.9 వేల పైచిలుకు కోట్లు విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల ముందు..అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు తగ్గిస్తానని, ఎండలో, గాలిలో కరెంట్ తయారు చేసి వినియోగదారుల నుంచి మిగులు కరెంట్ కొనుగోలు చేస్తానని చెప్పారని, కానీ అధికారంలోకి రాగానే యూజర్ చార్జీల పేరుతో ప్రజలు కోలుకోలేకుండా భారం మోపారని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసం మరోసారి నిరూపితమైందన్నారు. బాబు ష్యూరిటీ..బాదుడు గ్యారంటీ లాగా చంద్రబాబు పాలన ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలను రకరకాల మాయమాటలతో కొత్త కొత్త అబద్ధాలతో మోసం చేయడం బాబు ట్రేడ్ మార్క్ రాజకీయమని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలోనూ విద్యుత్ రంగాన్ని నిట్టనిలువునా ముంచేస్తూ డిస్కంలను పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి దాదాపు 24 శాతం వార్షిక అప్పుతో డిస్కంలు కుదలయ్యేలా చేశాడని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రూ.47 వేల కోట్లను డిస్కంలకు అందించి చేయూత ఇచ్చారని కొనియాడారు. గతంలో అవసరం లేకపోయినా అధిక ధరలకు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. చంద్రబాబు ఏం చేసినా ఆహో ఓహో అంటూ పచ్చపత్రికలు బాకాలు ఊదుతున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అందులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 27న నిరసన తెలిపి విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేస్తామని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్ సీపీ పోరుబాట గోడపత్రికను ఆవిష్కరించారు. పార్టీ వైద్య విభాగం మాజీ రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, మైనారిటీ సెల్ జిల్లా అద్యక్షుడు షేక్ సుల్తాన్, మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌రెడ్డి, మసనం వెంకట్రావు, పొన్నలూరు ఎంపీపీ కె.మాధవరావు, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, షేక్ పటేల్, షేక్ కరీం, రాపూరి ప్రభావతి, చొప్పర శివ, చుక్కా కిరణ్‌కుమార్, సునీల్, షేక్ అబ్దుల్లా, పాలూరి శ్రీనివాసులరెడ్డి, తన్నీరు రామకృష్ణ, షేక్ అహమ్మద్, తన్నీరు వినోద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మోసం చేయడంలో ట్రేడ్‌మార్క్ చంద్రబాబు విద్యుత్ వినియోగదారులకు షాకులే షాకులు పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు పోరాటం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
Comments
Please login to add a commentAdd a comment