తమ్ముళ్ల కన్ను పడితే..
పొన్నలూరు:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల్లోని తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా భూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా కట్టడాలు నిర్మించవద్దని గ్రామస్తులు కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చినా పట్టించుకోవడంలేదు. అవేవీ మాకు వర్తించవంటూ నియోజకవర్గ ముఖ్య నేతల అండదండలతో అధికారులను, స్థానికులను బెదిరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. అక్రమాలకు తెరతీస్తున్నారు. మండలంలోని పెదవెంకన్నపాలెం గ్రామంలో సర్వే నంబర్ 99/1లో 54.50 ఎకరాల వాగు పోరంబోకు భూమి ఉంది. ఈ భూమి తారు రోడ్డుకు ఇరువైపులా గ్రామానికి సమీపంలో ఉంటుంది. ఈ భూమి విలువ సుమారుగా రూ.60 లక్షల వరకు ఉంటుంది. విలువైన ఆ భూమిపై అధికారపార్టీ నాయకుల కన్ను పడింది. ఒక్కసారిగా ఆక్రమిస్తే తేడాలు వస్తాయని భావించారు. ముందుగా వరిగడ్డి వాములు, గేదెల దొడ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత గుట్టుచప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవంగా 2012లో బీసీలు తమకు ఇళ్ల స్థలాలు లేవని గ్రామానికి సమీపంలో ఉన్న వాగుపోరంబోకు భూమిలో గుడిసెలు వేశారు. అయితే అప్పటిలో విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని సందర్శించి గుడిసెలను తొలగించారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే నిర్మాణాలు చేపడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం చేశారు. అదే సమయంలో గ్రామంలోని కొందరు వాగు పోరంబోకు భూమిని ఎవరూ ఆక్రమించుకోకూడదంటూ 2013లో కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు అధికారపార్టీ నాయకులు 2015 మార్చి నెలలో వారి అనుకూల వ్యక్తులను పురమాయించి గ్రామానికి సమీపంలో ఉన్న వాగు పోరంబోకు భూమిలో గుడిసెలు వేశారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి స్పందించి వాటిని గుడిసెలను తొలగించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మరో మారు హెచ్చరించారు.
మళ్లీ అక్రమ కట్టడాలకు శ్రీకారం...
రెవెన్యూ అధికారుల హెచ్చరికలతో ఆ స్థలం వైపు ఎవరూ వెళ్లలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ తెలుగు తమ్ముళ్ల కన్ను వాగుపోరంబోకు భూమిపై పడింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమ నిర్మాణాలకు తెరతీశారు. నియోజకవర్గ పెద్దల అండతో వారు రెచ్చిపోతున్నారు. తమను అడిగేవారు లేరంటూ యథేచ్ఛగా వాగుపోరంబోకు భూమిలో అక్రమంగా గోకులం షెడ్డును నిర్మిస్తున్నారు. కొందరు గ్రామస్తులు ఈ అక్రమ కట్టడాన్ని ప్రశ్నించినా దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇప్పటికే సిమెంట్ పిల్లర్లు పోసి మట్టితో చదును చేశారు. నాడు నిర్మాణాలను అడ్డుకున్న అధికారులు సైతం నేడు విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేస్తున్నా పట్టీపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం.
పట్టించుకోని అధికారులు
రెండు గ్రామాల్లో విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన తెలుగు తమ్ముళ్లు వారి స్వప్రయోజనం కోసం అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెట్టి శిక్షిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఊదరకొడుతున్నా క్షేత్ర స్థాయిలో తెలుగు తమ్ముళ్లకు చట్టాలేమీ వర్తించడం లేదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
పెదవెంకన్నపాలెంలో దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా వాగుపోరంబోకు ఆక్రమించి.. గోకులం షెడ్ నిర్మాణం తిమ్మపాలెంలో బండి బాట స్థలంలో బ్యారన్లు నోరెత్తని రెవెన్యూ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment