టమోఠా..
పెద్దారవీడు: ఖరీఫ్ సీజన్లో టమోటా పంట సాగు చేసిన రైతులు డీలా పడ్డారు. మండల పరిధిలో దాదాపు 200 ఎకరాలు టమోటా పంట రైతులు సాగు చేశారు. మొక్కలు నాటిన దగ్గర నుంచి కాయలు కోసే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన టమోటా రైతుల కంట కన్నీరు ఉబుకుతోంది. పంట సాగు కోసం అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు కూడా రావని దిగాలు చెందుతున్నారు. ఎకరా పొలంలో మొక్కలు నాటిన దగ్గర నుంచి కాయలు కోత కోసే వరకు, కూలీలకు, రసాయన మందులకు దాదాపు రూ.40 వేల పెట్టుబడి అవుతుంది. మార్కాపురం మార్కెట్లో 25 కేజీలు బాక్స్ రూ.80 నుంచి రూ.100 లకు ధర పడిపోవడంతో కాయలు కోసిన కోత కూలీ కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 కేజీల బాక్స్ కనీసం రూ.200 పైగా ధర పలికితేనే గిట్టుబాటవుతుందని రైతులు తెలిపారు. కనీసం కిలో రూ.10 లకు మద్దతు ధర కూడా పలకడంలేదని ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడి వచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో నష్టాలు మిగులుతున్నాయని వాపోతున్నారు. కాయలు కోసినందుకు రోజుకు ఒకరికి రూ.300 కూలీ, మార్కాపురం మార్కెట్‌కు ఆటోలో బాక్స్‌కు రవాణా చార్జీ రూ.30, మార్కెట్లో ఒక బాక్స్ దిగుమతి రూ.5, కమీషన్ రూ.5 ప్రకారం ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. ప్రభుత్వం టమోటాకు మద్దతు ధర కల్పించి, నష్టాల నుంచి బయటపడేలా ఆదుకోవాలని కోరుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి:
ఎకరా పొలంలో టమోటా పంట సాగు చేశాను. కాయలు కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడంలేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయి. పంటకు పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని దుస్థితిలో ఉన్నాను. ప్రభుత్వం టమోటా రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– దుదేకుల నాగులమీరావలి, పెద్దారవీడు గ్రామం
పడిపోయిన టమోటా ధరలు నష్టాల్లో రైతులు
Comments
Please login to add a commentAdd a comment