సగానికి సగం మందే...
ఒంగోలు టౌన్: పోలీసు ఉద్యోగాల నియమకాలకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. 5వ రోజు శనివారం మహిళా పోలీసు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. 455 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 221 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో 114 మంది క్వాలిఫై అవడంతో వారు తదుపరి రాత పరీక్షలకు అర్హత సాధించారు. అంటే సగం మంది పరీక్షలకు హాజరుకాగా వారిలో సగం మంది ఎంపిక కావడం గమనార్హం. ఒకవైపు చలి వణికిస్తున్నా లెక్క చేయకుండా ఉదయం 5 గంటలకు మహిళా అభ్యర్థులు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. అడ్మిట్ కార్డుతో లోపలకు ప్రవేశించిన తరువాత సర్టిఫికెట్లు పరిశీలించారు. ఎత్తు, ఛాతీ కొలతలు తీసుకున్న తరువాత 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. తదుపరి అభ్యర్థుల వివరాలను ఆర్‌ఎఫ్‌ఐడీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేశారు. అభ్యర్థులకు మంచినీటి సౌకర్యంతోపాటు ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.
డబ్బులకు ఉద్యోగాలు రావు:
ఎస్పీ ఏఆర్ దామోదర్
ఎవరైనా డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెబితే నమ్మవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావని, ప్రతిభ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మొత్తంలో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కానీ, అక్రమాలకు కానీ తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వారి ఆరోగ్య స్థితిగతులను ఆధారం చేసుకొని మాత్రమే హాజరుకావాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని చెప్పారు. ఈ ఈవెంట్స్‌లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, పీటీసీ డీఎస్పీ మాధవ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, పీటీసీ డీఎస్పీ లక్ష్మణ్ కుమార్, డీపీవో ఏఓ రామ్మోహనరావు, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ, ఆర్‌ఐలు, డీపీవో సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా పోలీసు నియామకాలకు 455 మందికి గాను 221 మంది హాజరు
హాజరైనవారిలో 114 మందే క్వాలిఫై
ఉత్సాహంగా కొనసాగుతున్న పోలీసు ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment