వైఎస్సార్ సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్టీ సెల్ అధ్యక్షునిగా పటాలవత్ రాములు నాయక్, వలంటీర్ వింగ్ అధ్యక్షునిగా ఎస్కే.నాయబ్ రసూల్, సోషల్‌మీడియా వింగ్ అధ్యక్షునిగా వెన్నా శివక్రిష్ణారెడ్డి, స్టూడెంట్ వింగ్ అధ్యక్షునిగా పల్నాటి రవీంద్రనాథ్‌రెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షునిగా మంగమూరి శ్రీనివాసులు, అంగన్‌వాడీ వింగ్ అధ్యక్షులుగా కనపర్తి గోవిందమ్మ లను నియమించినట్లు తెలిపారు.
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ బదిలీ
● కొత్తగా ఎస్ జాన్సన్ నియామకం
ఒంగోలు అర్బన్: ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు జిల్లాలో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారిగా ఉన్న వీఎస్ లోకేశ్వరరావును అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేయగా ఆయన స్థానంలో పదోన్నతిపై ఎస్ జాన్సన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువు పెంపు
ఒంగోలు అర్బన్: ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారంతో గడువు ముగియనుండటంతో మరో 5 రోజుల పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎస్‌ఓపీ విధి విధానాలతో ప్రభుత్వం 265 జీవోను విడుదల చేసినట్లు తెలిపారు. ఆ మేరకు ఈ నెల 12వ తేదీ వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఈ నెల 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అనంతరం తనిఖీలు పూర్తి చేసి తుది సర్వే వివరాలను ఈనెల 20వ తేదీ గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వివరించారు.
పదో తరగతి స్టడీమెటీరియల్ ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: ఎస్‌సీఈఆర్టీ వారు రూపొందించిన పదో తరగతి స్టడీ మెటీరియల్ ను స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. జిల్లా డీసీఈబీ ముద్రణ చేసి ప్రతి పాఠశాలకు ఉచితంగా రెండు కాపీలను సరఫరా చేస్తుందని డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు చీమకుర్తి క్రీడాకారుడు
చీమకుర్తి: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ రెజ్లింగ్ పోటీలకు చీమకుర్తికి చెందిన క్రీడాకారుడు మేకల ఉమామహేశ్వరరావు ఎంపికై నట్లు కోచ్ కే.వెంకట్ మంగళవారం చీమకుర్తిలో తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని గురుకాశి యూనివర్శిటీలో ఈనెల 10 నుంచి 15 వరకు నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావును స్థానికులతో పాటు వారి కుటుంబ సభ్యులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment