సమస్యల ఒరబడి
పేదలకు కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యంతో మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేసింది గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటమే కాకుండా అధునాతన వసతులు కల్పించింది. విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసింది. కానీ కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికొదిలేసింది. ఎన్నికల కారణంగా నిలిచిపోయిన నాడు–నేడు రెండో దశ పనులకు మంగళం పాడేసింది. మౌలిక వసతులు కొరవడడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
ఒంగోలు రామ్‌నగర్‌లో మున్సిపల్ హైస్కూల్ లో
నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు
ఒంగోలు సిటీ:
జిల్లాలో 2,407 ప్రభుత్వ పాఠశాలల్లో 1,90,410 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధునిక వసతులు కల్పించేందుకు పనులు చేపట్టింది. అందులో భాగంగా తొలివిడతగా జిల్లాలో 1015 పాఠశాలలను ఎంపిక చేసింది. వాటికి రూ.229.61 కోట్లు కేటాయించింది. వీటితో 7431 పనులు పూర్తి చేసింది. తరగతి గదుల నిర్మాణం, ఆధునికీకరణ, ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, వాటర్ ప్లాంట్లు, ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులు, విద్యుదీకరణ ఇలా వివిధ పనులను పూర్తి చేసి కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చేసింది. మొదటి విడతలో చేసిన పనులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ స్కూళ్లను చూసి ఆశ్చర్యపోయారు. మా పిల్లలకు మంచిరోజులొచ్చాయంటూ సంబరపడిపోయారు. ఇక జిల్లా వ్యాప్తంగా రెండో దశలో 979 పాఠశాలు అంగన్‌వాడీ కేంద్రాలను ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి రూ.417.31 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది.
నాడు–నేడు రెండో దశ పనుల్లో మరమ్మతులకు సంబంధించి 404 మరుగుదొడ్లకు గాను 402 పనులు పూర్తి చేశారు. 538 పాఠశాలలకు విద్యుద్దీకరణ చేయాల్సి ఉండగా 529 పాఠశాలలకు పనులు పూర్తి చేశారు. 670 వంట గదులకు గాను 669 వంట గదుల నిర్మాణాలను పూర్తి చేశారు. 522 తరగతి గదుల మరమ్మతులు చేయాలని నిర్ణయించగా 520 పనులు పూర్తయ్యాయి. 80 పాఠశాలల్లో 71 తరగతి గదుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల వరకు పనులు వేగవంతంగా సాగాయి. ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిచిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తరువాత పనులకు అతీగతీలేకుండా పోయింది. పాఠశాలల అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏడు నెలలు కావస్తున్నా పెండింగ్ పనులకు పైసా నిధులు విడుదల చేయలేదు. ఒక్కసారి కూడా నాడు–నేడు పనులపై సమీక్ష జరగలేదు. కొన్ని పాఠశాలల్లో గదులు శ్లాబ్‌లు పోసి వదిలేశారు. కొన్ని చోట్ల గదులు పూర్తయినా ప్లాస్టింగ్, కిటికీలు, రంగులు వేయకుండా కాలయాపన చేస్తున్నారు. కారణాలు అడిగితే సిమెంట్ కొరత, మేసీ్త్రలు రావడం లేదని, కూలీలు అందుబాటులో లేరని, నిధులు విడుదల కాకపోవడమేనని కాంట్రాక్టర్లు, అధికారులు చెబుతున్నారు. దీంతో అరకొర వసతుల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను పూర్తిగా వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు తరగతి గదుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తే విద్యార్థులు చెట్ల కింద, ఆవరణలో పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నిలిచిన నిర్మాణాలు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పనులపై నీలినీడలు ముందుకు సాగని రెండో విడత ఆధునికీకరణ పనులు గదులు, మౌలిక వసతుల కొరతతో విద్యార్థుల ఇబ్బందులు పాఠశాలల్లో పనిచేయని వాటర్ ప్లాంట్లు పట్టించుకోని విద్యాశాఖాధికారులు
మౌలిక వసతుల్లేక అవస్థ..
కూటమి ప్రభుత్వం మిగిలిపోయిన పనులపై దృష్టి సారించకపోవడంతో పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ, టోఫెల్ పరీక్ష విధానం తదితర వాటికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికై నా మిగిలిపోయిన నాడు– నేడు పనులు పూర్తి చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో వాటర్ ప్లాంట్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటి వద్ద నుంచి బాటిల్స్ తీసుకొస్తున్నారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని రామ్‌నగర్‌లో ఆర్వో ప్లాంటు పనిచేయక మంచినీరు రావడం లేదు. విద్యార్థుల కోసం క్యాన్లు కూడా తీసుకురాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దాదాపు అన్ని స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అదనపు తరగతి నిర్మాణ గదులు పూర్తికాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. అలాగే గత ప్రభుత్వంలో అన్ని రకాల సౌకర్యాలు, హంగులతో రూపు దిద్దిన ప్రభుత్వ పాఠశాలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే నిర్వహణ లోపంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కూడా కూటమి ప్రభుత్వం చేయడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment