ప్రాణం తీసిన మద్యం మత్తు
దర్శి: మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాలపాటి అనిల్ (29) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన దర్శి మండలంలోని తూర్పువీరాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పువీరాయపాలెం గ్రామానికి చెందిన మాలపాటి అనిల్ తన స్నేహితులైన యరమాల ధర్మారావు, ధర్నాసి చిన్నబాబుతో కలిసి ధర్మారావుకు చెందిన ఇతియోస్ కారులో తూర్పువీరాయపాలెం పొలిమేరకు వెళ్లాడు. అక్కడ తమతో పాటు తెచ్చుకున్న మద్యం తాగారు. అది సరిపోక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొట్లపాలెం గ్రామం వెళ్లి అక్కడ కూడా మద్యం కొని తాగి తమ ఊరికి కారులో బయలు దేరారు. యరమాల ధర్మారావు కారు నడుపుతుండగా, అనిల్ ముందు సీట్లో కూర్చుని ఉన్నాడు. చిన్నబాబు వెనుక సీట్లో కూర్చుని ఉన్నాడు. మార్గం మధ్యలో వీరాయపాలెం సమీపంలో మలుపు వద్ద మద్యం మత్తు, అతివేగం కారణంగా కారు అదుపుతప్పి రోడ్డుకు కుడివైపు ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు తిరగబడి మాగాణి పొలంలోకి పల్టీలు కొట్టింది. ముందు సీట్లో కూర్చుని ఉన్న అనిల్‌కు దెబ్బలు తగిలి బురదలో కూరుకుపోయి స్పృహ కోల్పోయాడు. చిన్నబాబు తలకు చిన్నపాటి గాయాలవగా, కారు నడుపుతున్న యరమాల ధర్మారావుకు ఎటువంటి గాయాలు కాలేదు. చుట్టుపక్కల వారు వచ్చి వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అనిల్‌ను డ్యూటీ డాక్టర్ పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కారు ఢీకొట్టిన స్తంభం మూడు ముక్కలై విరిగిపోయింది. కారుతో సహా పక్కనున్న వరి చేలో పడింది. విద్యుత్ వైర్లు కూడా పీక్కుని వచ్చి చేలో పడ్డాయి. ప్రమాదాన్ని చూసిన వారు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. కారు పల్టీలు కొట్టిన తర్వాత కూడా ఇంజిన్ ఆగిపోలేదు. వైఫర్ కూడా తిరుగుతూనే ఉంది. మాగాణిలో పడటంతో క్షతగాత్రులు బురదతో నిండిపోయారు. చిన్నబాబుకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. మృతుడు అనిల్‌కు భార్య, కుమారుడు ఉండగా, భార్య స్వప్న ప్రస్తుతం 9వ నెల గర్భిణీగా ఉంది. అనిల్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కారు ప్రమాదంలో వ్యక్తి మృతి
మరొకరికి తీవ్రగాయాలు
మద్యం మత్తులో వేగంగా నడిపి
స్తంభాన్ని ఢీకొట్టిన కారు
Comments
Please login to add a commentAdd a comment