ఒంగోలు నగరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల అత్యుత్సాహం ప్రజల పాలిట శాపంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదినం సందర్భంగా నగరంలోని రోడ్లపై అడుగడుగునా అడ్డదిడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, కనీస విచక్షణ లేకుండా రోడ్ల పక్కన, డివైడర్లపై, జంక్షన్లలో, మలుపుల్లో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వచ్చేంత వరకూ కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే జన్మదినం సోమవారం కాగా, శుక్రవారం నుంచే రోడ్లన్నింటినీ అడ్డగోలుగా ఫ్లెక్సీలతో నింపడంతో రెండు రోజులుగా పలు చోట్ల వాహనాలు ఢీకొని ప్రమాదాలు కూడా జరిగాయి. పలువురు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. నగరంలోని రోడ్లపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అసలే అన్నీ ఇరుకురోడ్లు కావడంతో పాటు భారీ ఫ్లెక్సీల ఏర్పాటుతో మరింత ఇరుగ్గా మారిపోయాయి. జంక్షన్లలో నాలుగువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో అన్ని రహదారుల నుంచి వచ్చే వాహనాలు పూర్తిగా దగ్గరకు వచ్చేంత వరకూ కనిపించడం లేదు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన ఎమ్మెల్యే కూడా పట్టించుకోకుండా టీడీపీ శ్రేణులను ఇష్టారాజ్యంగా వదిలేయడంపై తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కలెక్టర్ నుంచి అధికారుల వరకూ ఇవే రోడ్లపై రాకపోకలు సాగిస్తుంటారు. ఫ్లెక్సీల కారణంగా వాహనదారులు అసౌకర్యానికి గురవడంతో పాటు ప్రమాదాలు జరుగుతాయన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. అధికార పార్టీ కావడంతో వారు కూడా తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తుండటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
– సాక్షి, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment