వారం తర్వాత వెలుగులోకి రోడ్డు ప్రమాదం
దర్శి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన వారం తర్వాత ఆదివారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... దర్శికి చెందిన మారం శివకోటిరెడ్డి (30)కి రెండేళ్ల క్రితం కొత్తపల్లి గ్రామానికి చెందిన కోమలితో వివాహం జరిగింది. శివకోటిరెడ్డి లారీలు బాడుగలకు తిప్పుతూ ఉంటాడు. వివాహం జరిగిన 8 నెలలకు గొంతు క్యాన్సర్ రావడంతో చికిత్స పొందుతున్నాడు. గొంతు ఆపరేషన్ కూడా చేశారు. ఈ క్రమంలో కోమలి తల్లిదండ్రులు తమ కుమార్తెను భర్త దగ్గర ఉంచడం ఇష్టంలేక పుట్టింటికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల వద్దే కోమలి ఉంటోంది. కోమలికి భర్త అంటే ఎంతో ఇష్టం. శివకోటిరెడ్డి కూడా తన భార్యకు తరచూ ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. అప్పడప్పుడు కోమలి దర్శి వచ్చి శివకోటిరెడ్డిని కలిసి వెళ్తుంటుంది. శివకోటిరెడ్డి కూడా కొత్తపల్లి వెళ్లి కోమలిని కలిసి వస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ రాత్రి 1.40 గంటల ప్రాంతంలో శివకోటిరెడ్డి తన భార్య కోమలిని కలవడానికి కొత్తపల్లి వెళ్లాడు. అక్కడ భార్యతో మాట్లాడిన అనంతరం 2.40 గంటలకు బుల్లెట్‌పై దర్శి బయలుదేరాడు. పక్కన లక్ష్మీపురం మీదుగా వస్తుండగా, రాజంపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న టర్నింగ్‌లో వేగంగా వస్తున్న బుల్లెట్ అదుపుతప్పి కాలువపైన ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. శివకోటిరెడ్డి కూడా ముళ్లపొదల్లో పడిపోయాడు. అప్పటి నుంచి అతని ఫోన్ స్విచాఫ్ అయింది. అతని తమ్ముడు రమణారెడ్డి అయ్యప్పస్వామి మాల ధరించి ఇరుముడి కట్టుకుని ఈ నెల 13వ తేదీ శబరిమల వెళ్లాడు. తన అన్నకు ఫోన్‌చేయగా స్విచాఫ్ రావడంతో కనుమ పండుగ రోజు స్థానిక ఎస్సైకి ఫోన్ చేసి తన అన్న కనిపించడం లేదని చెప్పాడు. శబరిమల నుంచి ఇంటికి వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పక్క పొలం రైతు మందు కొట్టేందుకు వచ్చి వాసన వస్తోందని చూడగా, ముళ్ల పొదల్లో బుల్లెట్ వాహనం, పక్కనే శివకోటిరెడ్డి మృతదేహం కనిపించాయి. ఘటన జరిగి వారం రోజులు కావడంతో మృతదేహం పూర్తిగా గుర్తు పట్టలేని స్థితికి చేరింది. దీంతో ఆ రైతు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పక్కనే బుల్లెట్ వాహనం ద్వారా గుర్తించి కుటుంబ సభ్యులను పిలిపించగా, అది శివకోటిరెడ్డి మృతదేహంగా వారు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. శివకోటిరెడ్డి తండ్రి కూడా నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment