రాష్ట్రంలో క్రీడలు నిర్వీర్యం
యర్రగొండపాలెం: రాష్ట్ర ప్రజలను మోసగించే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేసిందని, యువత భవితవ్యంపై ఆటాడుకుంటోందని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్, పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు హర్షిత్‌రెడ్డి విమర్శించారు. ఈ నెల 13 నుంచి తాటిపర్తి ఆధ్వర్యంలో ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా వారు విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తమది కాకపోతే గ్రౌండ్ ఉండదని, అన్ని విధాలుగా అభ్యంతరాలు తెలుపుతారని, అనేక ఇబ్బందులకు గురిచేస్తారన్న విషయం తెలిసినా ఎన్ని కేసులు పెడుతున్నా లెక్కచేయకుండా ఎమ్మెల్యే తాటిపర్తి యువతను ప్రోత్సహించేందుకు వెనకబడిన ప్రాంతమైన యర్రగొండపాలెంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం సాహసంతో కూడిన పనేనని అన్నారు. టోర్నమెంట్ సందర్భంగా గ్రౌండ్‌లో సున్నం వేసే దగ్గర నుంచి అన్నీ తానై పనిచేసిన ఆయనకు యువతపై ఎంత మక్కువ ఉందో ఇట్టే తెలుస్తుందన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం యువతతోపాటు పేద ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేదని, కేవలం తమ వర్గీయులకు సంపాదించిపెట్టే పనిలో ఉందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి యువత దృష్టిని క్రీడలవైపు మళ్లించి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ, యువకులు, విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీశారని చెప్పారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకున్నా జగనన్నను ఆదర్శంగా తీసుకొని క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమన్నారు.
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ వచ్చిన తరువాత దోచుకునే పనిలో పడ్డారని, ఖర్చుపెట్టే పరిస్థితిలో వారు లేరన్నారు. ఈ దోపిడీ రాజ్యంలో పండుగలకు కూడా గడవనటువంటి దయనీయ పరిస్థితుల్లో పేదకుటుంబాలు ఉన్నాయన్నారు. వైఎస్సార్ అంటే ఒక భరోసా అని, ఆ భరోసాను యువతకు ఇవ్వటానికి, వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహించటానికి ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో చేసుకుందామని అన్నారు. టీడీపీ నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అర్హత ఉన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించారని, వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కూడా శనివారం మరొక కేసు నమోదు చేశారని, టీడీపీ వర్గీయులు చేసే దోపిడీ, దుర్మార్గానికి, లూఠీకి, లాలూచి కార్యక్రమాలకు అడ్డుగా ఉంటున్నామని కేసులు పెడతారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూటమి ప్రభుత్వం ఉందని ఎవరికీ అనిపించడంలేదని, యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉందన్నట్లు ప్రజలు భావిస్తున్నారని, వారికి తామందరం అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాన్నగారికి యర్రగొండపాలెం నియోజకవర్గంపై ఎనలేని ప్రేమ ఉందని, ఈ నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని అన్నారు. 7 రోజుల పాటు ఒక టోర్నమెంట్ జరపాలంటే ఒక వ్యక్తితో అయ్యేపనికాదని, ఒక వ్యవస్థ ఉండాలన్నారు. జగనన్న ఎంతో అద్భుతంగా తన పాలనలో క్రీడా స్ఫూర్తిని కలిగించారని చెప్పారు. అనంతరం విజేతలకు వారు మెమొంటోలతోపాటు నగదు బహుమతులు అందజేశారు. క్రికెట్ టీం విన్నర్‌గా నిలిచిన త్రిపురాంతకం హోం టీంకు రూ.50 వేలు నగదు బహుమతి అందజేసిన చాపలమడుగు పంచాయతీ సర్పంచ్ తమ్మినేని సత్యనారాయణరెడ్డి (సత్తిరెడ్డి), రన్నర్‌గా నిలిచిన గంజివారిపల్లె టీంకు రూ.30 వేలు అందచేసిన మర్రివేముల పార్టీ నాయకుడు ఎల్లారెడ్డి రోషిరెడ్డి, మూడో స్థానంలో నిలిచిన రేగుమానిపల్లె టీంకు రూ.20 వేలు అందచేసిన పార్టీ నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, క్రీడాకారులకు భోజన సదుపాయాలు కల్పించిన భూమిరెడ్డి సుబ్బారెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
యువత భవితవ్యంపై ఆటాడుకుంటున్న కూటమి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంతో క్రీడలను ప్రోత్సహించిన జగనన్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బూచేపల్లి, తాటిపర్తి, హర్షిత్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment