ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి
ఒంగోలు అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణతో కలిసి మీకోసం గ్రీవెన్స్ కార్యాక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. దీనిలో మొత్తం 302 అర్జీలు కలెక్టర్‌కు అందాయి. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీల తాలూకు సమస్యలకు సకాలంలో శాశ్వతమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారం కాని సమస్యలుంటే వాటి గురించి పూర్తి వివరాలను అర్జీదారులకు వివరించి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. నిర్ణీత సమయం దాటి అర్జీలు ఎటువంటి పరిస్థితిలోను పెండింగ్‌లో ఉండకూడదన్నారు. ప్రతిరోజు లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో వచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. దీనిలో డీఆర్‌ఓ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు వరకుమార్, విజయజ్యోతి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● మాలమహానాడు అధ్యక్షుడు బిళ్లా చెన్నయ్య గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వైద్య ఆరోగ్య శాఖలోని సమస్యలపై అర్జీ అందజేశాడు. కోర్టు ఉత్తర్వుల మేరకు కుటుంబ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో కరవది అనిల్ అనే వ్యక్తికి ఉద్యోగంలో చేరేందుకు అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా కట్టా రాజేష్‌బాబు సదరం సర్టిఫికెట్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు విచారణ జరిపించాలని కోరాడు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పలు అంశాలపై దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశాడు.
బీసీ సంఘ నాయకుడు కొటికలపూడి జయరాం గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్‌ను కలిసి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి మహిళా ఉద్యోగి ఒకరు బీసీ రిజర్వేషన్‌ను వినియోగించుకున్నారని, దానిపై జరిగిన విచారణకు సంబంధించి నాటి డీఈఓ తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు. 2008 డీఎస్‌సీలో గ్రేడ్–2 తెలుగు పండిట్ పోస్టుకు సంబంధించి ఈ అవకతవక జరిగిందని, అయితే ఆ ఉద్యోగి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందారని తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. పరిశీలించి సరైన నివేదక పొందుపరిచేలా మళ్లీ విచారణ చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చాడు.
కొడుకులు అన్నం పెట్టడం లేదని ఫిర్యాదు
టంగుటూరు: కన్న కొడుకులే తిండి పెట్టడం లేదని టంగుటూరు మండలం నిడమనూరు గ్రామానికి చెందిన తంపనేని సౌభాగ్యమ్మ అనే వృద్ధురాలు సోమవారం ఒంగోలులో మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాను వేడుకుంది. కలెక్టర్ తో వృద్ధురాలు మాట్లాడుతూ ఏ పనీ చేయలేని వృద్ధురాలినని, నీవే న్యాయం చేసి..అన్నం పెట్టేలా చూడాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment