పోస్టల్ ఉద్యోగి..ఖోఖోలో మెరిసి
నిరాశపరిచినా వెనుదిరగలేదు
దర్శి: ఎన్ని ఆటంకాలొచ్చినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించాలన్న సంకల్పం ఆ యువ క్రీడాకారుడిని విశ్వవేదికపై నిలిపింది. చిన్నతనం నుంచి ఆసక్తి ఉన్న ఖోఖో క్రీడలో సత్తా చాటి అంతర్జాతీయ పోటీలకు ఎంపికై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి ఖోఖో క్రీడాకారుడు. స్పోర్ట్స్ కోటాలోనే పోస్టల్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ తనకిష్టమైన క్రీడ ఖోఖోలో సత్తా చాటుతున్నాడు. ఈక్రమంలో భారత జట్టుకు ఎంపికై ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్ చాంపియన్ షిప్‌లో పాల్గొన్నాడు. ఈ పోటీల్లో భారత జట్టు అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి వరల్డ్ కప్ కై వసం చేసుకుంది. భారత్–నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శివారెడ్డి బెస్ట్ ఎటాకర్‌గా అవార్డు అందుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో 54 సెకన్లలో మూడు అవుట్‌లు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన శైలిలో ఆటలో సత్తా చాటి ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం గర్వించేలా తన ప్రతిభ చాటాడు. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 20 దేశాలు పాల్గొన్నాయి.
ఖోఖో పయనం ఇలా..
శివారెడ్డి 2006 నుంచి ఖోఖోలో సాధన మొదలు పెట్టాడు. 6 నుంచి 9వ తరగతి చదుకుంటున్న సమయంలో కాశీవిశ్వనాథరెడ్డి అనే అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుడు ఆటలో శివారెడ్డికి మెళకువలు నేర్పారు. అ తరువాత మధు అనే మరో కోచ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పంగులూరు లో ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన మేకల సీతారామిరెడ్డి అనే కోచ్ శివారెడ్డి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించేలా చేసి ముందుకు తీసుకుని వెళ్లారు. సీనియర్ ఆటగాళ్లు శివారెడ్డిని నిరాశపర్చినా అన్నీ విధాలా అండగా ఉండి ముందుకు నడిపించారు. ఒకానొక సమయంలో తల్లిదండ్రులు సైతం క్రీడలు వద్దని చదువుకోమని, లేదంటే వ్యాపారం పెట్టుకోమని శివారెడ్డిని ఒత్తిడి చేశారు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులకు సర్ది చెప్పి పంగులూరులోనే అన్నీ మెళకువలు నేర్పి అంచెలంచెలుగా ఎదిగేలా శివారెడ్డిని తీర్చి దిద్దారు. 2018లో లండన్‌లో జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని ప్రతిభ చూపడంతో అప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. శివారెడ్డి తమ్ముడు పరమేశ్వరరెడ్డి కూడా విలేజ్ సర్వేయర్‌గా స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగం సంపాదించారు.
విశ్వవిజేత భారత జట్టులో సత్తాచాటిన జిల్లా వాసి పోతిరెడ్డి శివారెడ్డి స్వగ్రామం ముండ్లమూరు మండలం ఈదర జట్టులో కీలక పాత్ర పోషించి విజయకేతనం ఎగరేసి.. రైతు కుటుంబానికి చెందిన శివారెడ్డి పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగి ఎందరు నిరాశపరిచినా అడుగులు ముందుకు వేసిన వైనం
Comments
Please login to add a commentAdd a comment