పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు టౌన్: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.హనుమంతరావు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార సంఘ ఉద్యోగులకు 2019 మార్చిలో విడుదల చేసిన జీఓ 36ను అమలు చేస్తామని మంత్రి అచ్చెంనాయుడు మాట ఇచ్చి తప్పారని అన్నారు. కంప్యూటరీకరణలో భాగంగా డీసీటీ, ప్రీ మైగ్రేషన్ చేస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామని సహకార శాఖ కమిషనర్ చెప్పడంతో ఉద్యోగులు ఎంతో ఆశతో రాత్రనక పగలనక ఆర్‌సీఎస్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో దశలవారీ ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలిపారు. సహకార సంఘాల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, 2019 తరువాత జాయిన్ అయిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సహకార సంఘాలను ఇన్‌కం ట్యాక్స్ పరిధి నుంచి తప్పించాలని, 2019 పే రివిజన్‌ను అమలు చేయాలని, హెచ్‌ఆర్‌సీ పాలసీతో కూడిన 36 జీఓను రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఫిబ్రవరి 10 నుంచి నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ధర్నాలో యూనియన్ నాయకులు వి.మనోజ్ కుమార్, రామాంజిరెడ్డి, ఆర్ శంకర్, రామిరెడ్డి, కె.సుబ్బారావు, మల్లికార్జునరావు, రాజేష్, రమేష్, కృష్ణ, చైతన్యతో పాటుగా 250 మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment