మధ్యవర్తిత్వంతో సమస్యల పరిష్కారం
● ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.అమ్మన్నరాజా
ఒంగోలు: ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం చక్కటి పరిష్కార వేదిక అని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.అమ్మన్నరాజా పేర్కొన్నారు. స్థానిక జిల్లా న్యాయస్థానం ఆవరణలోని సమావేశ మందిరంలో సోమవారం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరువర్గాల ఆమోదంతోనే న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తారని, ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలన్నారు. దీనివల్ల న్యాయ స్థానాల మీద తీవ్రమైన ఒత్తిడి తగ్గడమే కాకుండా పనిభారం కూడా కొంతవరకు తగ్గుతుందన్నారు. మధ్యవర్తిత్వ అంశానికి సంబంధించి శిక్షకురాలిగా జయగోయల్, నగీనా జైన్ అనే సుప్రీంకోర్టు న్యాయవాదులు హాజరయ్యారని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి.రాజా వెంకటాద్రి, డి.రాములు, పి.లలిత , సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.దీనా, ఎస్.హేమలత, జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగిశెట్టి మోహన్‌దాస్, ఇతర న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మధ్యవర్తిత్వం ప్రాధాన్యత, దానిని న్యాయస్థానాల్లో ఎలా అమలుచేస్తారు తదితర అంశాల గురించి సుప్రీంకోర్టు న్యాయవాదులు అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment