ఎస్సీ బాలుర హాస్టల్ పునః ప్రారంభం
● అడ్మిషన్లు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు
పొన్నలూరు: గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా వారి సౌకర్యార్థం మండల కేంద్రమైన పొన్నలూరులో 2016లో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో చుట్టు పక్కల గ్రామాలతో పాటు వివిధ మండలాల నుంచి పేద విద్యార్థులు హాస్టల్‌లో చేరి స్థానిక ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వసతి గృహం అద్దె భవనంలో ఏర్పాటు చేసినా ఎనిమిదేళ్ల పాటు చుట్టు పక్కల విద్యార్థులకు వసతి కల్పించి చదువుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో మొదట మూడు నెలలు హాస్టల్ నిర్వహించినా వార్డెన్ లేకపోవడంతో పాటు అధికారులు నిర్లక్ష్యం వలన సరిపడిన విద్యార్థుల సంఖ్య లేదంటూ ఇటీవల హాస్టల్‌ని పూర్తిగా మూసివేసి సామగ్రిని తరలిస్తున్నారు. దీంతో హాస్టల్ మూసివేతపై ఆదివారం ‘సాక్షి’లో ‘ఎస్సీ బాలుర హాస్టల్ మూసివేత’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఒంగోలు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్ వెంటనే ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పునః ప్రారంభించి మంగళవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి విద్యార్థులను అడ్మిషన్ చేయాలని ఇన్‌చార్జి వార్డెన్‌తో పాటు కింది స్థాయి అధికారులకు ఆదేశించారు. దీంతో సిబ్బంది సోమవారం హాస్టల్‌ని తెరచి శుభ్రం చేశారు.
విద్యుత్ మీటర్స్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఒంగోలు టౌన్: జిల్లాలో గత 15 ఏళ్లుగా 250 మంది విద్యుత్ రీడర్లుగా పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న స్మార్ట్ మీటర్ల వలన వారి ఉపాధి దెబ్బతింటుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అన్నారు. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూనియన్ నగర నాయకులు శ్రీరాం శ్రీనివాసరావు, అనిల్ కుమార్, సతీష్ కుమార్, బి.నారాయణ, డి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
దళితులు, గిరిజనులపై పెరిగిన దాడులు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో దళితులు, గిరిజనుల మీద దాడులు పెరిగిపోయాయని, దళితులను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం నిర్వహించిన కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఒంగోలులో దళితుల సమస్యల మీద రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారన్నారు. రాబోయే రోజుల్లో దళితుల సమస్యల మీద రాష్ట్ర స్థాయి పోరాటాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దళిత ఉద్యోగులు, మేధావులు, అభ్యుదయ వాదులు, ప్రజాతంత్ర వాదులు ఈ వర్క్‌షాపులో పాల్గొని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని, అత్యాచారాలు, హత్యలు పేట్రేగి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని దళితులలో నేటికీ వెనకబాటుతనం ఉండడం బాధాకరమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం అన్నారు. శ్మశానాల సమస్య జిల్లాలో దళితులకు సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల శ్మశానాల సమస్యల మీద ప్రత్యేకంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. అనంతరం వర్క్‌షాపునకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, మోజేష్, మేకల రామయ్య, అంగలకుర్తి సూరిబాబు, దిడ్ల నారాయణ, సంజీవరావు, కాకుమాను సుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment