రాళ్లు కొల్లగొట్టి..
కళ్లలో ఇసుక కొట్టి..
పొన్నలూరు: పొన్నలూరు మండలం చెన్నిపాడు సమీపంలోని సంగమేశ్వరం వద్ద మాకేరు–పాలేరు నదిపై మధ్య తరహా జలాశయం నిర్మాణానికి 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేశారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మొదటి నుంచి సక్రమంగా పనులు చేపట్టకపోవడంతో 19 ఏళ్లగా పనులు ముందుకు సాగలేదు. కేవలం 25 శాతం మాత్రమే జరిగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తరచూ కాంట్రాక్టర్లను మారుస్తూ వచ్చింది. తరువాత 2018లో ప్రాజెక్టు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మట్టికట్ట, స్పిల్‌వే పనులు చేపట్టారు. స్పిల్‌వేకు రెండువైపులా 2.8 కిలోమీటర్ల పొడవున మట్టికట్ట నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. మట్టికట్ట నిర్మించే ప్రాంతంలో పది అడుగుల మేర గుంత తీశారు. సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న నాణ్యమైన ఇసుకను వృథా చేయకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఉపయోగించవచ్చని అధికారులు భావించారు.
50 వేల టన్నుల ఇసుక నిల్వ
మట్టికట్ట నిర్మాణ ప్రాంతం నుంచి పొక్లెయిన్ల ద్వారా తవ్వి, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించారు. అలా సుమారుగా 50 వేల టన్నుల ఇసుకను నిల్వ చేశారు. ఇసుక తరలించేందుకు వినియోగించిన ట్రాక్టర్లు, పొక్లెయిన్లకు సుమారు రూ.2.50 కోట్లు చెల్లించారు. అలాగే స్పిల్‌వే నిర్మించే ప్రాంతంలో కూడా పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో వాటిని కూడా బ్లాస్టింగ్ చేసి రాళ్లను తొలగించారు. ఈ తొలగించిన రాళ్లను కూడా సైజ్ చేసి ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఉపయోగించవచ్చని లారీలతో పక్కకు తరలించి నిల్వ చేశారు.
రూ.3 కోట్ల ఇసుక, రాళ్లు మాయం...
2018 నుంచి 2024 వరకు ప్రాజెక్టు నిర్మాణం కోసం నిల్వచేసిన ఇసుక, రాళ్ల జోలికి ఎవ్వరూ వెళ్లలేదు. కొందరు అక్రమార్కులు 2022లో రాళ్లను తరలించేందుకు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఇసుకను, రాళ్లను, మిగిలిన వస్తువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వాటి జోలికి ఎవరూ పోలేదు. ఎప్పటి నుంచో వీటిపై కన్నేసిన తెలుగుదేశం పార్టీ నేతలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెచ్చిపోయారు. ఇసుక, రాళ్లను రాత్రుళ్లు వాహనాల్లో తరలించుకుపోయారు. తొలుత పొక్లెయిన్ సహాయంతో ఇసుకను తోడేశారు. రాత్రుళ్లు ట్రాక్టర్లలో తరలించేశారు. ఆరు నెలల్లో సుమారుగా 25 వేల టన్నుల ఇసుకను దోచేసినట్టు సమాచారం. దీని విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే నిల్వ చేసిన రాళ్లను కూడా అవకాశం దొరికినప్పుడు ట్రక్కుల్లో తరలించారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుంది.
పట్టించుకోని ప్రాజెక్టు అధికారులు...
సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కోసం నిల్వ చేసిన 50 వేల టన్నుల ఇసుకను, రాళ్లను అక్రమంగా అక్రమార్కులు తరలిస్తుంటే ప్రాజెక్టు అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదు. టన్నుల కొద్దీ ఇసుకను దోచేస్తుంటే పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారు. దీనిపై కొందరు గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ ఇసుక, రాళ్ల తరలింపును అడ్డుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment