ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దు తగదు
● రిటైర్డ్ ఆర్‌జేడీ గోపాల్ రెడ్డి
ఒంగోలు టౌన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలనుకోవడం అర్థంలేని నిర్ణయం అని రిటైర్డ్ ఆర్‌జేడీ గోపాల్ రెడ్డి అన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తే రెండో సంవత్సరంపై భారం పడుతుందని చెప్పారు. 20 నెలల పాటు చదివిన విద్యార్థులు ఒకేసారి పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడతారని స్పష్టం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని, సిలబస్ ను మార్చాలని, ఇంటర్నల్ మార్కులు ఏర్పాటు చేయాలని ఇంటీర్మీడియెట్ విద్యా మండలి బోర్డు చేసిన ప్రతిపాదనలపై ఆదివారం ఎల్బీజీ భవనంలో ఎస్‌ఎఫ్‌ఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ విషయంపై జనవరి 26వ తేదీలోపు అభిప్రాయాలు చెప్పమని అడగడం సహేతుకం కాదని, 1964లో కొఠారి కమీషన్ వేస్తే రెండు సంవత్సరాల పాటు చర్చలు జరిగిన తరువాత 1966లో దానిని అమలులోకి తెచ్చారని తెలిపారు. కనీసం ఏడాది పాటు దీనిపై విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు నిర్వహించాలని సూచించారు. ఇంటర్మీడియెట్ రంగంలో పనిచేసే అపారమైన అనుభవం కలిగిన వారిని సంప్రదించకుండా కేవలం కార్పొరేట్ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని మంగమ్మ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏవీ పుల్లారావు విమర్శించారు. ఇంటర్నల్ మార్కుల విధానం విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని అడ్డుకుంటాయని, ప్రశ్నించే తత్వం లేని చోట పరిశోధనలు జరగవని చెప్పారు. ఉమ్మడి జాబితాలోని విద్యా అంశాన్ని కేంద్రం చేతిలోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని కాషాయీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ చేస్తుందని మండిపడ్డారు. నిరుపేద విద్యార్థులను చదువులకు దూరం చేసే కుయుక్తులతోనే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని చూస్తున్నారని విశ్రాంత ప్రిన్సిపాల్ టి.వెంకటేశ్వరరెడ్డి విమర్శించారు. నిజంగా ఇంటర్ విద్య పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ప్రతి కాలేజీలోనూ ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, బడ్జెట్లో విద్యకు తగినంత నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవేమీ చేయకుండా ఇంటర్ పరీక్ష రద్దు చేస్తే విద్య అభివృద్ధి అవుతుందని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ నిరుపేద విద్యార్థులు చదువులకు దూరం అవుతారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్ అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు విజయ్, బండి వీరాస్వామి, ఆరోన్, సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment