సనాతన ధర్మ రక్షణ ఎక్కడ పవన్
● ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
టంగుటూరు: సనాతన ధర్మ రక్షణ ఎక్కడ పవన్ కళ్యాణ్ అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో టంగుటూరు లోని జూనో బేకరీ వద్ద కొంత సమయం సేద తీరడానికి ఆగారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను, పాటిస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ తిరుమలలో సనాతన ధర్మాన్ని పాటిస్తున్నావా అని ప్రశ్నించారు. మీరు చేసే పాపాలే తిరుమలలో సంఘటనలకు కారణమవుతున్నాయని, దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారని, మీరే బాధ్యులుగా ఉంటారా అని ప్రశ్నించారు. నెల వ్యవధిలో తొక్కిసలాట, అగ్ని ప్రమాదం జరిగాయని, మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన భక్తుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. తిరుమలలోకి గుడ్డు, బిర్యాని వంటి పదార్థాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. తిరుమలలో జరిగే ఈ సంఘటనలకు నీవు బాధ్యత వహిస్తావా? ఈ నెపాన్ని ఎవరి మీదకై నా తోసి వేస్తావా అని అడిగారు.
గడ్డి పెంపకంపై అటవీశాఖ సిబ్బందికి శిక్షణ
● శిక్షణ ఇచ్చిన ‘గ్రాస్‌మ్యాన్ ఆఫ్
ఇండియా’ గజానన్ దాదా మురాత్కర్
పెద్దదోర్నాల: గడ్డి పెంపకంపై అటవీశాఖ సిబ్బందికి అవగాహన కల్పిస్తూ వారికి శిక్షణ తరగతులను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని తుమ్మలబైలు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గిద్దలూరు, మార్కాపురం డివిజన్‌కు చెందిన అధికారులతో పాటు గ్రాస్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే ప్రొఫెసర్ గజానన్ దాదా మురాత్కర్ పాల్గొని గ్రాస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్‌పై సిబ్బందిపై అవగాహన కల్పించారు. గడ్డి పెరుగుదలతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, శాఖాహార వన్యప్రాణులు పెరుగుదల ఉంటుందన్నారు. దీని వల్ల మాంసాహార వన్యప్రాణులు సైతం పెరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కాపురం, గిద్దలూరు డిప్యూటీ డైరక్టర్లు సందీప్ కృపాకర్, నీషా కుమారి, సబ్ డీఎఫ్‌ఓలు వేణు, శ్రీకాంత్‌రెడ్డి, రేంజి అధికారులు వరప్రసాద్, జీవన్‌కుమార్, ప్రసన్నజ్యోతి, సుబ్బారావు, నీలకంఠేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి, సుజాత, డీఆర్వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment