హంతకులను శిక్షించండి
● గిద్దలూరు పోలీసు స్టేషన్ ఎదుట మృతుడి
బంధువుల ధర్నా
గిద్దలూరు రూరల్: తమ పిల్లవాడిని హత్య చేసిన వారిని శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ మండలంలోని కె.ఎస్.పల్లె ఎస్సీపాలేనికి చెందిన పలువురు సోమవారం గిద్దలూరు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన గడ్డం ఆనంద్(19) అనే యువకుడు పట్టణంలోని సెయింట్‌పాల్స్ బీఈడీ కళాశాల వెనుక నీటి కుంటలో మృతి చెందాడు. ఆనంద్ తల్లిందండ్రులు లేకపోవడంతో అతడి చిన్నమ్మ వద్ద పెరిగాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆనంద్‌ను స్నేహితులే హత్య చేసి నీటి కుంటలో పడేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై సీఐ కె.సురేష్ స్పందిస్తూ.. నాలుగు రోజుల్లో పోస్టుమార్టం నివేదిక వస్తుందని, దాని ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని, హత్య అని నిర్ధారణ అయితే నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment