మా భూమి మాకు ఇప్పించండి సారూ...
మర్రిపూడి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏం చేసినా చెల్లుతుందని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మండలంలోని రావెళ్లవారిపాలెం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత దాదాపు రూ.2.5 కోట్ల విలువైన దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో ఎక్కించుకుని, నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి..యథేచ్ఛగా ఆక్రమించుకుని అనుభవిస్తున్నాడు. ప్రశ్నించిన దళితులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో దళితులు మా భూమిని మాకు ఇప్పించాలంటూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. రావెళ్లవారిపాలెం మాజీ సర్పంచ్ పాలెపు పద్మ భర్త అయిన పాలెపు రమణయ్య టీడీపీ గ్రామ స్థాయి నాయకుడిగా చలామణి అవుతున్నాడు. గ్రామంలో దళిత సామాజికవర్గానికి చెందిన పులగం నరసమ్మకు చిమట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 727–1లో 1.63 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆమె కుమారులకు పంపకం కుదరకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో కొన్నాళ్లుగా అది బీడుగా ఉంది. ఆ భూమిని ఆనుకున్న ఉన్న భూమి యజమాపి అయిన పాలెపు రమణయ్య కన్ను దానిపై పడింది. నర్సమ్మ కుమారులకు తెలియకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలెపు రమణయ్య కుమార్తె ప్రశాంతి పేరున ఆన్‌లైన్ చేయించాడు. అలాగే గ్రామానికి చెందిన పులగం పెదకోటయ్యకు 40 ఏళ్ల క్రితం సర్వే నంబర్ 727–19లో 1.88 ఎకరాల అసైన్‌మెంట్ భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూమిని కూడా హక్కుదారునికి తెలియకుండా పాలెపు రమణయ్య కుమారుడు తిరుపతినాయుడు పేరు మీద ఆన్‌లైన్ ఎక్కించుకుని నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించారు. అలాగే రావిళ్లవారిపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ సొలసా చినమ్మకు సర్వే నంబర్ 740–3లో 0.92 ఎకరాల భూమి ఉంది. దీనిని కూడా ఆమెకు తెలియకుండా రమణయ్య కుమార్తె ప్రశాంతి పేరుపై ఆన్‌లైన్ చేయించుకున్నాడు. ఇలా చిమట, జువ్విగుంట రెవెన్యూ పరిధిలో సుమారు రూ.2.5 కోట్ల విలువైన భూములను కబ్జా చేసినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
40 ఏళ్ల క్రితం ప్రభుత్వం సాగుచేసుకునేందుకు ఇచ్చిన అసైన్డ్ భూములను తమకు తెలియకుండా టీడీపీ నాయకుడు పాలెపు రమణయ్య ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఆన్‌లైన్‌లో ఎక్కించుకుని, నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించారని దళితులు వాపోయారు. పేదల భూములను ఆక్రమించుకుని అనుభవిస్తుందే కాక తిరిగి మాపైనే మర్రిపూడి పోలీస్‌స్టేషన్‌లో రమణయ్య, ఆయన కుమారులు తిరుపతయ్య, వెంకటేశ్వర్లు ఆదివారం ఫిర్యాదు చేశారని గ్రామానికి చెందిన దళితులు పులగం పెదకోటయ్య, పులగం చిన్నకోటయ్య, సొలసా చెన్నమ్మ, పులగం కోటయ్య, యర్రజెన్ను బ్రహ్మయ్య, పులగం అంకమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయం జరిగేంత వరకు పోరాడతాయని వారు భీష్మించారు. మర్రిపూడి ఎస్‌ఐ రమేష్‌బాబు దళితుల వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం న్యాయం చేస్తామనడంతో తమ నిరసన విరమించారు.
అధికార అండతో ఆగని టీడీపీ నేత
ఆగడాలు
దళితుల భూమిని ఆక్రమించి వారిపైనే ఫిర్యాదు
తహశీల్దార్ కార్యాలయం ఎదుట
దళితుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment