కాపురాల్లో సెల్ చిచ్చు!
దొనకొండ: తన భార్యకు పక్కింటి వ్యక్తి సెల్‌ఫోన్ కొనిచ్చాడని తెలిసి తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి బంధువులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. దొనకొండ మండలంలోని రుద్రవరం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల కథనం మేరకు.. రుద్రవరంలో దుగ్గెంపూడి మల్లికార్జున, మోటా వెంకటేశ్వర్లు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. ఈ నెల 16వ తేదీన మోటా వెంకటేశ్వర్లు ఆటోలో దొనకొండ వెళ్లిన మల్లికార్జున భార్య రూ.800 సెల్‌ఫోన్‌తో ఇంటికి చేరుకుంది. అదేరోజు రాత్రి సెల్‌ఫోన్‌ను చూసి భర్త ప్రశ్నించగా మోట వెంకటేశ్వర్లు ఆటోలో దొనకొండ వెళ్లి తెచ్చుకున్నానని చెప్పింది. దీంతో మల్లికార్జున కోపోద్రిక్తుడై వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి ‘నా భార్యకు సెల్‌ఫోన్ కొనిచ్చే వాడివా’ అంటూ దాడి చేశాడు. ఈ పరిణామంతో వెంకటేశ్వర్లు ఊరు విడిచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు వెంకటేశ్వర్లు భార్య శివమ్మ వద్దకు వెళ్లి ‘నీ భర్త ఎటుపోయాడు. మీరు మా ఛాయల్లో ఉండటానికి వీల్లేదు’ అంటూ గద్దించారు. ఆదివారం తన భార్యతో కలిసి దొనకొండ పోలీసులకు మల్లికార్జున ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలన్నీ గుర్తు చేసుకుని, మరో 10 మంది వ్యక్తులతో కలిసి మద్యం తాగి ఆదివారం రాత్రి మోట వెంకటేశ్వర్లు నివాసం ఉంటున్న రేకుల షెడ్‌తోపాటు ఆటో, రెండు బైకులకు నిప్పు పెట్టడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. తాము ఎరుకలోల్లమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆస్తి ధ్వంసం చేశారని శివమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. త్రిపురాంతకం సీఐ హసన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
‘మద్యం వల్లే సార్ గొడవలు’
రుద్రవరంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన సీఐకి గ్రామస్తులు మద్యం అక్రమ విక్రయాల గురించి వివరించారు. గ్రామ నడిబొడ్డులో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని చెప్పారు. ‘గతంలో మా ఊరిలో మద్యం అమ్మేవారు కాదు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. మద్యం తాగినోళ్లు ఘర్షణలకు దిగుతున్నారు’ అని గ్రామానికి చెందిన కొందరు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. బెల్టుషాపులు తొలగించకుంటే ఊరంతా కలిసి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
దొనకొండ మండలం రుద్రవరంలో ఉద్రిక్తత
భార్యకు మరో వ్యక్తి సెల్‌ఫోన్ కొనిచ్చాడని భర్త ఆగ్రహం
బంధువులతో కలిసి ఎస్టీ కుటుంబంపై దాడి
రేకుల షెడ్, ఆటో, రెండు బైకులకు నిప్పు
కులం పేరుతో దూషించి, దాడి చేశారని బాధితుల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment