నమ్మించి మోసం చేశారు
ఒంగోలు టౌన్: జిల్లాలో రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొందరు, వ్యాపారం పేరుతో మరికొందరు అమాయకులను నమ్మించి ముంచుతున్నారు. లక్షలాది రుపాయలు కాజేసి ఒట్టి చేతులు చూపుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా భయపడటం లేదు. మోసగాళ్లకు శిక్షలు పడకపోవడంతో బరితెగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా జైలుకు వెళ్లినా తిరిగి వచ్చి మళ్లీ మోసాలకు తెగబడుతున్నారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల వేదికలో మోసాల గురించి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా సరే మోసగాళ్లు లెక్కచేయడం లేదు. తాజాగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో ఈ తరహా మోసాలపై రెండు ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు కేసుల్లో బాధితులు రూ.16.55 లక్షలు పోగొట్టుకున్నారు. దర్శి సమీపంలో చేపల చెరువును లీజుకు ఇప్పిస్తానంటూ ఒంగోలు భాగ్యనగర్‌కు చెందిన ఒకరు తమ ఐదుగురి నుంచి విడతలవారీగా రూ.13.10 లక్షలు తీసుకున్నాడని కొండపి మండలానికి చెందిన వ్యక్తి ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రంలోని ఏదైనా ఒక యూనివర్శిటీలో తమ కుమారుడికి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రూ.3.45 లక్షలు తీసుకుని మోసం చేశాడని తాళ్లూరు మండలానికి చెందిన ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. ఆయా ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విచారణ చేపట్టి తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. ఉద్యోగాలు, వ్యాపారాల పేరిట జరుగుతున్న మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఈ సందర్భంగా సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పే వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, డీసీఆర్‌బీ సీఐ దేవ ప్రభాకర్, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు బాధితుల మొర
Comments
Please login to add a commentAdd a comment