నా బిడ్డ ఆచూకీ తెలపండి..
నాగులుప్పలపాడు: మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో ఓ యువకుడిపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లడంతో పాటు 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ తల్లికి తెలపకపోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..భోగి పండుగ రోజు స్థానిక ఎస్టీ కాలనీలో చోటుచేసుకున్న చిన్న వివాదంలో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త ఈర్ల సాయి విషయంలో రాజీ చేశారు. అయితే గ్రామంలో టీడీపీ నేతలు అదే అదనుగా భావించి అతని మీద మరో రెండు కేసులు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు ఈర్ల సాయి (20)పై కేసులు నమోదు చేసి ఆదివారం అర్ధరాత్రి ఒంగోలులో అదుపులోకి తీసుకుని సోమవారం రాత్రి వరకు కూడా అతని ఆచూకీ తెలపలేదు. దీనిపై యువకుని తల్లి ఈర్ల సలోమి నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్‌లో అడిగినా సమాధానం లేకపోవడంతో ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి విచారించినా తన కుమారుడి ఆచూకీ చెప్పడం లేదని.. తన బిడ్డను ఏమైనా చేశారా అని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గ్రామంలో ఐదు రోజుల్లో ఏడుగురికి రిమాండ్..
సంక్రాంతి పండుగ వేళల్లో గ్రామాల్లో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదాలను రాజకీయంగా వినియోగించుకోవాలని గత ఐదు రోజుల్లో ఒక్క అమ్మనబ్రోలు గ్రామంలోనే వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఏడుగురిని అరెస్టు చేసి రివమాండ్‌కు పంపించారు. ఇదే గ్రామంలో కనుమ పండుగ రోజు టీడీపీ కార్యకర్తలు ముగ్గురు మద్యం తాగి గొర్రెలను తొక్కించబోతే.. చూసి బండి నడపమన్నందుకు కొణికి రాఘవ అనే యువకుడిని విచక్షణ రహితంగా కొట్టడంతో రాఘవకు పక్కటెముకలు విరిగాయి. ఈ కేసులో పోలీసులు దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులపై నామమాత్రపు కేసులు నమోదు చేశారని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తను అర్ధరాత్రి తీసుకెళ్లిన పోలీసులు
24 గంటలు గడిచినా ఆచూకీ లేదని తల్లి ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment