రాజన్న సిరిసిల్ల
ఆదివారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2024
వస్త్రపరిశ్రమకు వైభవం తెస్తాం
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ● పాలిస్టర్ వస్త్రోత్పత్తి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
7
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల వస్త్రపరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక పద్మశాలి కల్యాణ భవనంలో శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బకాయపడిన నిధుల్లో రూ.197కోట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు. పరిశ్రమ పురోగతికి కార్మికుల ఉపాధికి దోహదం చేసేలా యూనిఫామ్స్ ఆర్డర్లు ఇచ్చామన్నారు. 8 కోట్ల మీటర్లతో సుమారు 1.30కోట్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. 20 హెచ్‌పీల వరకు కరెంట్ సబ్సిడీ విషయాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక యంత్రాల వినియోగంతో వస్త్రోత్పతిలో సిరిసిల్ల నవ్యరీతిలో సాగిపోవాలని ఆకాంక్షించారు. పరిశ్రమలోని ఇతర సమస్యల పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే మిన్నగా వస్త్రపరిశ్రమ అభివృద్ధిపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన కార్యవర్గాన్ని సెల్‌ఫోన్‌లో అభినందించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూప, నాయకులు సంగీతం శ్రీనివాస్, గోలి వెంకటరమణ, గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, అడ్డగట్ల మురళి, బొద్దుల సుదర్శన్, కల్యాడపు సుభాష్ పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ఆడెపు భాస్కర్, అంకాలపు రవి, ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షుడిగా దూడం రమేశ్, కోశాధికారిగా మండల బాలరాజు, సహాయ కార్యదర్శిగా బండారి అశోక్ ప్రమాణ స్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment